అంకుల్‌ అన్నందుకు అంత రచ్చా..?

Update: 2015-04-07 08:39 GMT
వరుసగా చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాల పుణ్యమా అని.. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి దిగే వరకూ గుండె దడగా మారింది. సాంకేతిక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. మానవ తప్పిదాలు.. మానసిక సమస్యలతో కూడా వందలాదిగా ప్రయాణికుల ప్రాణాలు పోవటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్న అంశం.

ఫ్రాన్స్‌లో ఒక మానసిక రోగిగా ఉన్న కో పైలెట్‌ కారణంగా విమానాన్ని కూల్చేయటం తెలిసిందే. తాజాగా ఎయిర్‌ ఇండియాకు చెందిన ఒక విమానంలో పైలెట్‌.. కో పైలెట్‌ తిట్టుకొని..కొట్టుకునే పరిస్థితి రావటం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై వచ్చిన వార్తల్ని ఖండిస్తూ ఎయిర్‌ఇండియా పైలెట్‌.. కో పైలెట్‌లు కొట్టుకోలేదని వాగ్వాదం జరిగిందని చెప్పారు.

కోపైలెట్‌ రెచ్చిపోయినా పైలెట్‌ సంయమనంతో వ్యవహరించారని ఆ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఇంతకీ.. కాక్‌పిట్‌లో జరిగిన లల్లి ఏమిటన్న దానిపై దృష్టి సారించిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయానికి తిట్టుకొని.. కొట్టుకునే వరకూ వెళ్లారా? అని ఆశ్చర్యపోతున్నారు.

జరిగిందేమంటే.. సదరు విమానంలో కో పైలెట్‌ కంటే పైలెట్‌ వయసులో చిన్నవాడు. దీంతో.. తనకంటే పెద్దవాడైన కో పైలెట్‌ను అంకుల్‌ అని సంభోదించాడు. దీంతో.. కో పైలెట్‌కు మండిపోయి.. నన్ను అంకుల్‌ అని పిలవటానికి నువ్వెవరు అంటూ విరుచుకుపడ్డారంట. అంకుల్‌ కోపాన్ని గుర్తించి.. పైలెట్‌ కామ్‌గా ఉండిపోయాడట. చిన్నవారు.. పెద్దవారిని అంకుల్‌ అని పిలవటం కూడా తప్పేనా అని ఈ ఘటన గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News