హవ్వ! అమ్మ శత్రువులకు అగ్రపూజా!

Update: 2017-07-24 07:51 GMT
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు - శాశ్వత మిత్రులు ఉండరు అనేది అందరూ ఎరిగిన సత్యమే. అయితే పురట్చితలైవి జయలలితతో జీవితకాలం శతృత్వాన్ని కొనసాగించిన ప్రముఖులను - ఆమె మరణించిన తర్వాత.. ఆమె పార్టీ నెత్తిన పెట్టుకోవడానికి చూస్తుండడం ఒక చిత్రమైన సందర్భమే. జయలలిత ముఖ్యమంత్రిగా అధికార వైభవం వెలగబెడుతున్నప్పుడు వేర్వేరు సందర్భాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ - కమల్ హాసన్ లతో ఎలా సున్నం పెట్టుకున్నదో అందరికీ తెలుసు. చాలా రకాలుగా వారిని వేధించారనే ప్రచారం ఉంది. వారిలో కూడా ఆమె పట్ల అదే వైరభావం చివరి వరకు కొనసాగింది.

జయలలిత మరణించిన తర్వాత.. ఈ ఇద్దరూ కూడా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకునే ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు. రజినీ  పార్టీ ప్రయత్నాలు ఒకవైపు చాపకింద నీరులా సాగుతుండగా.. కమల్ హాసన్ అన్నా డీఎంకే ప్రభుత్వం మీద విమర్శల దాడిని ఆల్రెడీ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో.. జయలలిత వారసులుగా ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు.. ఈ ఇద్దరు ‘‘అమ్మ శత్రువుల’’ విషయంలో కాస్త మెత్తబడ్డట్లుగా (మరో రకంగా చెప్పాలంటే భయపడుతున్నట్లుగా) కనిపిస్తోంది. ‘‘మీకు ప్రజాసేవ చేయాలని ఉంటే గనుక.. అన్నాడీఎంకే లోనే వచ్చి చేరండి’’ అంటూ మంత్రులు రజినీ కమల్ లకు ఆహ్వానం పలుకుతున్నారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండు ముక్కలుగా ఉంది. తమ విభేదాల వలన ప్రత్యర్థులు బలపడుతున్నారనే వాస్తవాన్ని వీరు గుర్తిస్తున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం - సీఎం పళనిస్వామి వర్గాలు రెండు కలవాలని కూడా అనుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో .. పురట్చితలైవి లేని పార్టీకి ఒక స్ట్రాంగ్ ఇమేజి తీసుకురావడానికి తాము ఒక మెట్టు దిగి అయినా సరే.. అమ్మ శత్రువుల్ని అయినా సరే తమతో కలుపుకోవాలని వారు ఉవ్విళ్లూరుతున్నట్లుగా ఉంది.

అయితే కమల్ హాసన్ తాను ఒక్క నిర్ణయం తీసుకుంటే సీఎం కాగలనని ఇప్పటికే ఓ స్టేట్‌ మెంట్ ఇచ్చారు. రజినీకాంత్ పార్టీ అంటూ పెడితే ఖచ్చితంగా సీఎం అవుతారని అభిమానులు అంచనా వేస్తుంటారు. ఇలాంటి సీఎం స్థాయి ఉన్న ఇద్దరు సూపర్ స్టార్ లను అన్నాడీఎంకే మంత్రులు  తమ పార్టీలోకి ఆహ్వానిస్తే.. వారికి ఏం పదవులు ఇవ్వగలరు? ప్రస్తుతం వారి చేతిలో ఉన్న సీఎం పోస్టును వారికి ఇచ్చేయగలరా? పార్టీని కాపాడుకుంటే చాలు.. తమకు పదవులు ముఖ్యం కాదనే రకంగా వారు వ్యవహరించగలరా? అనేది అనుమానమే! అయినా..  సూపర్ స్టార్ల విషయంలో తొలుత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అన్నాడీఎంకే మంత్రులకు రోజులు గడిచే కొద్దీ క్లారిటీ వచ్చి, కాళ్లబేరానికి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అమ్మ శత్రువులే అయినా అగ్రపూజ చేయడానికి వారు సిద్ధంగానే ఉన్నట్లుంది.
Tags:    

Similar News