బాబుకు మ‌ద్ద‌తిచ్చినందుకు ఎంపీపై వేటు..

Update: 2018-03-17 12:40 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓ ఎంపీ ప‌ద‌విని ఊడ‌బీకింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై టీడీపీ ఇచ్చిన తీర్మానానికి మ‌ద్ద‌తుగా మాట్లాడినందుకు త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీ - సీనియ‌ర్ నేత కేసీ ప‌ళ‌నిస్వామిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. ఈయన ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి - పార్టీ సీనియ‌ర్ నేత ప‌న్నీర్‌ సెల్వం వ‌ర్గానికి చెందిన నేత‌. కాగా, ఆయ‌న్ను ప‌న్నీర్‌ తో పాటు సీఎం ప‌ళ‌నిస్వామి క‌లిసి బ‌హిష్క‌రించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం మంచి నిర్ణ‌య‌మ‌ని పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఉన్న కేసీ ప‌ళ‌నిస్వామి ఓ టీవీ చానల్‌లోని ప్ర‌క‌టించారు. ఏపీ ఆకాంక్ష వ‌లే త‌మ రాష్ర్టానికి చెందిన కీల‌క స‌మ‌స్య అయిన కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆహ్వానించ‌ద‌గిన చ‌ర్య అని పేర్కొన్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వానికి స‌న్నిహితంగా మారుతున్న అన్నాడీఎంకే వ‌ర్గాలు తాజాగా ఎంపీ, పార్టీ అధికార ప్ర‌తినిధి హోదాలో ప‌ళ‌నిస్వామి చేసిన కామెంట్‌కు షాక్ తిన్నాయి. దీంతో వెంట‌నే కేసీ పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

కాగా, ఈ ప‌రిణామంపై కేసీ ప‌ళ‌నిస్వామి స్పందించారు. ఉద్దేశ‌పూరితంగా త‌న‌ను సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బ‌హిష్క‌రించార‌ని ఆరోపించారు. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీలో కొన‌సాగుతూ దివంగ‌త జ‌య‌ల‌లిత సిద్ధాంతాల ప్ర‌కారం ప‌నిచేస్తున్న తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు ఆ ఇద్ద‌రికీ లేదని మండిప‌డ్డారు. వారికంటే తాను పార్టీలో సీనియర్ అని, ఇద్దరి అసలు బండారం బయటపెడుతానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌టితో ఆగ‌కుండా...అన్నాడీఎంకే పార్టీలో చీలకవస్తోందని చెప్పిన ముఖ్య‌మంత్రి - ఉప‌ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేంగా పార్టీ నేత‌లు ఏక‌మ‌వుతున్నార‌ని ప్ర‌క‌టించి పళనిస్వామి ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News