ఫ్లైట్ లో చుక్కలు చూపించిన సిబ్బంది లొల్లి

Update: 2016-03-11 06:28 GMT
వీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నారంటే విమాన సిబ్బంది కాస్త జాగ్రత్తగా ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తారన్న భావన ఉంటుంది. కానీ.. అదేమీ పెద్ద విషయాలు కావన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. వీవీఐపీలకు చుక్కలు చూపించిన వైనం ఇండియన్ ఎయిర్ లైన్స్ లో తాజాగా చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో విమాన సిబ్బంది మధ్య చోటు చేసుకున్న గొడవ ముదిరి.. వారిలో వారు వాదులాడుకోవటం.. గొడవపడటమే కాదు.. విమానం దిగుతానని చెబుతున్న వీఐపీలకు అందుకు అనుమతివ్వకపోవటం.. అదే సమయంలో విమానాన్ని కదల్చకపోవటం లాంటి పనులతో చుక్కలు చూపించారు.

ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం కదలటానికి సిద్దంగా ఉన్న సమయంలో విమానంలోని సిబ్బంది మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో.. సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం.. రాత్రి 8 గంటల వరకూ కదలకపోవటం గమనార్హం. ఇంతకీ ఆ విమానంలో ఎవరున్నారంటారా? సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్.. ముగ్గురు ఎంపీలు.. 16 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారంతా వెయిట్ చేస్తున్నా విమాన సిబ్బందికి తమ మధ్య నెలకొన్న పంచాయితీనే తప్పించి.. మిగిలినవేమీ పట్టలేదు.

దీంతో విసిగిపోయిన వారు.. విమానం దిగేందుకు ప్రయత్నిస్తే అందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. దీంతో.. మూడు గంటల్లో ముగియాల్సిన వారి ప్రయాణం.. ఏకంగా ఐదు గంటలకు పైనే సాగిందట. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన సదరు ప్రముఖులు ఫిర్యాదు చేయటం.. సిబ్బందిలో ఇద్దరిని సస్పెండ్ చేయటం జరిగిపోయాయి. ఏమైనా తాజా అనుభవం వీఐపీలకు షాకింగ్ గా మారిందంటున్నారు. తమను ఏ మాత్రం పట్టించుకోకుండా సిబ్బంది గొడవపడటం వారికి మింగుడు పడని వ్యవహారంగా మారిందంటున్నారు.
Tags:    

Similar News