కేంద్రమంత్రికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన పైలెట్

Update: 2016-12-29 07:44 GMT
వినేవాడు ఉంటే చెప్పేవాడు చెలరేగిపోతాడన్న మాట అప్పుడెప్పటి నుంచో ఉంది. అయితే.. ఈ మధ్యకాలంలో వచ్చిన చిక్కేమిటంటే.. వినే వాడు విని ఊరుకుండిపోకుండా.. చెప్పే వాడి మాటలకు కౌంటర్ అటాక్ ఇచ్చేలా మాట్లాడటం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అని.. అందరూ చెప్పేవాళ్లే అయ్యారు. తమ తప్పుల్ని కప్పి పుచ్చుకుంటూ.. నిత్యం హితబోధ చేసే వారి దుమ్ము రేపుతున్నారు.

నీతులు చెప్పే నేతలు తీరు.. నిజాయితీగా పని చేసే వారికి హితబోధ చేస్తారా? అంటూ చెలరేగిపోతున్నారు. తాజాగా.. అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. కేంద్రమంత్రికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఒకలేఖ రాసిన పైలెట్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎయిర్ ఇండియా పనితీరుపై అధికారులతో సమావేశమైన సందర్భంగా.. మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే.. ఎయిర్ ఇండియా కమిట్ మెంట్ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న వ్యాఖ్యలు చేసిన వేళ.. దానికి కౌంటర్ అన్నట్లుగా ఘాటుగా లేఖను ఒకటి సంధించారు. సుభాషిస్ మజుందార్ అనే సీనియర్ పైలెట్ మంత్రికి ఒక లేఖ రాస్తూ.. రాజకీయ నాయకుల్లో లోపిస్తున్న నిబద్ధత మాటేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

నిజాయితీగా పన్ను చెల్లించే వ్యక్తిగా.. దేశ పౌరుడిగా.. బాధ్యత కలిగిన ఉద్యోగిగా ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో రాజకీయ నేతలు సమయాన్ని వృధా చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఒక్క లోక్ సభలోనే 92 గంటల సమయం వృథాగా పోయిందని.. సభ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నేతలు నినాదాలు.. పోస్టర్ల ప్రదర్శనలు చేశారన్నారు. రాజకీయన నేతల తీరును చూసిన ఎయిరిండియా ఉద్యోగులంతా ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే మన నాయకులు నిబద్ధతలో వెనుకబడినట్లుగా భావించారని వ్యాఖ్యానించారు.

పనితీరు బాగోలేదన్న మంత్రిమాటకు సీనియర్ పైలెట్ ఈ స్థాయిలో విరుచుకుపడటం.. భారీగా క్లాస్ పీకటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అందరి దృష్టిని మారుతుంది. తప్పులు ఎత్తి చూపేవాళ్లు ముందు.. తాము తప్పులు చేయకుండా ఉండేలా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇలాంటి ఉదంతాలు ఒకటికి నాలుగు జరిగితే.. రాజకీయ నేతలు ఒళ్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడతారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News