అమ్మాల‌ని మీరు చెప్పాలా జైట్లీ?

Update: 2017-06-06 04:50 GMT
ఖ‌ర్చులు ఎక్కువ‌.. న‌ష్టాలు ఎక్కువ‌. ఎప్ప‌టిక‌ప్పుడు వేలాది కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌టం మిన‌హా.. ఎలాంటి లాభం రాని దాన్ని ఏం చేస్తాం? ఈ ప్ర‌శ్న‌ను రోడ్డు ప‌క్క‌న బ‌జ్జీల బండి పెట్టుకునేటోడ్ని అడిగినా.. అమ్మేయాల‌నో.. వ‌దిలించుకోవాల‌నో చెబుతారు. దీనికి కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ అవ‌స‌రం అస్స‌లు లేదు. అయితే.. నిర్వ‌హ‌ణ‌లోని లోపాల కార‌ణంగా ఎంత‌కూ ఎద‌గ‌కుండా ఉండిపోయిన ఒక సంస్థ‌ను లాభాల్లోకి ర‌ప్పించ‌టం.. విజ‌యాల దిశ‌గా ప‌రుగులు పెట్టించ‌టంలోనే ఉంది అస‌లు సామ‌ర్థ్య‌మంతా. ఆ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

భారీ న‌ష్టాల‌తో తెల్ల ఏనుగుగా మారిన ఎయిరిండియాను అమ్మేయ‌టం మేలైన చ‌ర్య‌గా కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కేవ‌లం 14 శాతం మార్కెట్ వాటా ఉన్న ఈ విమాన‌యాన సంస్థ కోసం రూ.55వేల కోట్ల ప్ర‌జ‌ల సొమ్మును ఖ‌ర్చు చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఇష్టం లేక‌పోతే వ‌దిలించుకోవ‌టం.. ఇష్టం ఉంటే అట్టి పెట్టేసుకోవ‌టం ప్ర‌భుత్వంలో ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఎయిరిండియా విష‌యం మీద మిగిలిన నేత‌ల మాదిరే మాట్లాడారు జైట్లీ. నిజానికి విమాన‌యాన రంగంలో అవ‌కాశాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

రానున్న రోజుల్లో విమాన‌యాన మ‌రింత వేగంగా మార్పులు చెంద‌నుంది. ఇలాంటి వేళ‌.. అవ‌కాశాల్ని ఒడిసి ప‌ట్టుకోవ‌టానికి ప్ర‌య‌త్నాలు చేయాల్సిన ప్ర‌భుత్వం.. అందుకు భిన్నంగా అమ్మేసుకుంటాన‌ని చెప్ప‌టం చూస్తే.. న‌ష్టాల ఊబిలో ఉన్న‌వాటిని లాభాల్లోకి తీసుకురాలేని చేత‌కానిత‌నంతో తాము ఉన్నామ‌న్న విష‌యాన్ని జైట్లీ ఒప్పుకుంటున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.

దేశంలో ఎయిరిండియా మార్కెట్ వాటా కేవ‌లం 14 శాతం మాత్ర‌మే. అంటే.. 86 శాతం మార్కెట్ వాటా ప‌లు సంస్థ‌ల‌కు ఉంది. కొన్ని సంస్థ‌లు.. త‌మ‌దైన నిర్ణ‌యాలు తీసుకొని దూసుకెళుతున్నాయి. మ‌రి.. ప్రైవేటు సంస్థ‌లు లాభాలు సాధిస్తున్న వ్యాపారంలో ఎయిరిండియా మాత్రం న‌ష్టాల్లో ఎందుకు మునిగిపోయిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌లోనే ప్ర‌భుత్వం చేత‌కానిత‌నం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌త స‌ర్కారు వైఫ‌ల్యాల కార‌ణంగా ఎయిరిండియాలో నిర్వ‌హ‌ణ లోపాలు చాలానే ఉన్నాయి. వాటికి మోడీ స‌ర్కారు చెక్ చెబుతుంద‌ని చాలామంది ఆశించారు. అయితే.. తాము కూడా ఏమీ చేయ‌లేమ‌ని.. ఎయిరిండియాను అమ్ముకోవ‌టం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్న‌ట్లుగా జైట్లీ మాట‌లు విస్మ‌యంగా అనిపిస్తాయి.

ఎందుకంటే.. రానున్న రోజుల్లో విమాన‌యాన రంగం మ‌రింత వేగంగా వృద్ధి చెంద‌నుంది. ఇలా వృద్ధి చెందే అవ‌కాశం ఉన్న రంగాల్ని ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌టం ఏమిట‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఇలాంటి వాద‌న‌ను ఎవ‌రైనా వినిపిస్తే.. వెంట‌నే నీతి అయోగ్ సైతం ఎయిరిండియాను అమ్మ‌మ‌ని చెప్పిందంటూ ప్ర‌స్తావించ‌టం చూస్తే.. ఎంత‌సేప‌టికి ఎయిరిండియాను అమ్మాల‌నే త‌ప్పించి.. దాన్ని ప్ర‌గ‌తి ప‌థంలోకి తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌లు ఏమీ ఉన్న‌ట్లుగా అనిపించ‌వు.

నిజానికి.. ఎయిరిండియాను గాడిన పెట్ట‌టం పెద్ద విష‌యం కాదు. స‌మ‌ర్థులైన అధికారుల్ని నియ‌మించ‌టం.. విధానాలు మార్చుకోవ‌టం.. సంస్క‌ర‌ణ‌ల్ని చేప‌ట్ట‌టం.. కాలం చెల్లిన విధానాల్ని తీసి పారేయ‌టం.. వృథాకు అవ‌కాశం ఇచ్చే అధికారుల‌పై వేటు వేయ‌టం లాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో పాటు.. ప్రైవేటు సంస్థ‌లు ఎలా అయితే నిర్వ‌హిస్తాయో అదే తీరులో పోటాపోటీగా ఎయిరిండియా నిర్వ‌హ‌ణను చేప‌డితే లాభాలు ఎందుకు రావు? అన్న‌ది ప్ర‌శ్న‌. వెనుక‌బాటు త‌నంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాన్నే మార్చేస్తామ‌ని.. వృద్ధి ప‌థంలోకి తీసుకెళ‌తామ‌ని చెప్పే పాల‌కులు.. వ్య‌వ‌స్థ‌లో ఒక చిన్న భాగ‌మైన ఎయిరిండియా లాంటి విభాగాన్ని వృద్ధిలోకి ఎందుకు తీసుకురాలేద‌న్న ప్ర‌శ్న వేసుకుంటే..అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది. న‌ష్టాల బూచిని చూపించి ఎయిరిండియాను ఎవ‌రో ఒక‌రి చేతిలో పెట్టాల‌న్న త‌లంపు త‌ప్పించి.. దాన్ని లాభాల బాట‌లోకి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌ను ఎందుకు చేయ‌ర‌న్న‌దే అస‌లు సందేహం?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News