రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న‌గ‌రాలు.. య‌మ డేంజ‌ర్‌.. ఇక‌, ఉండ‌లేరు సుమా!

Update: 2022-11-09 06:30 GMT
కాలుష్యం.. మ‌నిషిని బ‌తికుండ‌గానే చంపేసే ప్ర‌మాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణమ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఇటీవ‌లే వెల్ల‌డించింది. కాలుష్యంపై యుద్ధం చేయ‌క‌పోతే.. ఏయుద్ధాలు అవ‌స‌రం లేకుండానే ప్ర‌పంచం ప‌రిస‌మాప్త‌మ‌వుతుంద‌ని కూడా ఇటీవ‌ల హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే 2030 నాటికి కాలుష్య నియంత్ర‌ణ‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని కూడా సూచించింది. ప్ర‌స్తుతం మ‌న దేశం ఈ దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ నిషేధం..ఇందుకే అమ‌లు చేస్తున్నారు. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, బ్యాట‌రీ వాహ‌నాల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు. అయితే.. ఇదే కాలుష్యం.. రాను రాను మ‌రింత పెరిగిపోతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప‌లు న‌గ‌రాలు అత్యంత డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను సీపీసీబీ విడుదల చేసింది. తొలిసారిగా బిహార్‌లోని కతియార్‌ అత్యంత కాలుష్య నగరంగా తొలి స్థానంలో నిలిచింది.  తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో  గాలి నాణ్యతకు సంబంధించిన సీపీసీబీ తన నివేదికలో సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది.

పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ దేశంలోని చిన్న నగరాలను సైతం కాలుష్య కోరల్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు చేపడుతున్నప్పటికీ, దేశంలో పలు నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. మొత్తం 163 నగరాలకు సబంధించిన గాలి నాణ్యత ప్రమాణాల వివరాలు ఇందులో ఉన్నాయి.

వీటిలో బిహార్‌లోని కతిహర్‌ నగరంలో గాలి నాణ్యత (360 పాయింట్లు) పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఢిల్లీ(354 పాయింట్లు), నోయిడా (328), ఘజియాబాద్‌ (304) నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బిహార్‌లోని బెగుసరాయ్‌, హరియాణాలోని బల్లాబ్‌ఘర్, ఫరిదాబాద్‌, కైతాల్‌, గుడ్‌గావ్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లను అత్యంత కాలుష్య నగరాలుగా  సీపీసీబీ నిర్ధరించింది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, తిరుపతి,  విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం నగరాల గాలి నాణ్యత వివరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో విశాఖపట్టణం (202 పాయింట్లు) లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఇక హైదరాబాద్‌ (100), అనంతపురం (145), ఏలూరు (61), తిరుపతి (95)గా ఉన్నట్లు తెలిపింది.

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టడం, వాహనాలు విడుదల చేసే కర్భన ఉద్గారాల కారణంగా దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోందని సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై  భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పంజాబ్‌లో ఒక్క రోజులోనే పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 చోటుచేసుకున్నట్లు తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News