ఎయిర్ టెల్ బ్యాంకులు..అద్భుత‌మైన ఆఫ‌ర్లు

Update: 2016-11-24 04:01 GMT
సెల్యూలార్ సేవ‌ల రంగంలో త‌న‌దైన ముద్ర వేసుకున్న భారతీ ఎయిర్‌ టెల్ ఇకపై బ్యాంకింగ్ రంగంలోనూ ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధ‌మైంది. ఇప్పటి వరకు టెలికాం రంగంలో వినియోగదారులకు సేవలందిస్తూ వచ్చిన  ఆ సంస్థ 'ఎయిర్‌ టెల్ పేమెంట్స్ బ్యాంక్' పేరిట కొత్తగా బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్ట్‌ గా ప్రారంభమైన ఈ సేవలు ఇవాళ రాజస్థాన్‌ లో ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రంలో ఉన్న 10వేల ఎయిర్‌ టెల్ రిటెయిల్ ఔట్‌ లెట్లలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అక్కడి ప్రజలు నగదు డిపాజిట్ - విత్ డ్రా - ట్రాన్స్‌ ఫర్ - ఆన్‌ లైన్ షాపింగ్ - బిల్ పేమెంట్స్ వంటి పనులు చేసుకోవచ్చు.

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా స‌హజంగానే త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఎయిర్‌ టెల్ ప్రాధాన్యం ఇచ్చింది. ఎయిర్‌ టెల్ ఫోన్ నంబర్లు ఉన్న వారు ఆ నంబర్లనే తమ అకౌంట్ నంబర్లుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లలో వాడుకోవచ్చు. ఎయిర్‌ టెల్ వినియోగదారులు కాని వారు ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పిస్తే వారు కూడా ఎయిర్‌ టెల్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ ఎయిర్‌ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లలో వినియోగదారులు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అందుకు గాను వారికి 7.25 శాతం చొప్పున వడ్డీ కూడా లభిస్తుంది. నగదును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే దేశంలోని ఏ బ్యాంక్ ఖాతాకైనా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

ఈ బ్యాంకుల ద్వారా ఆన్‌ లైన్‌ లో బిల్ పేమెంట్స్ చేయవచ్చు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం ఎయిర్‌ టెల్ మనీ యాప్ ఉపయోగపడుతుంది. ఎయిర్‌ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లలో ఖాతాలు ఓపెన్ చేసే వారికి రూ.1లక్ష విలువ గల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభ్యమవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ తో జట్టుకట్టి బ్యాంకింగ్ సేవలను ఎయిర్‌ టెల్ అందిస్తుండగా, త్వరలో రాజస్థాన్‌ లోనే మరిన్ని ఔట్‌ లెట్లలో ఎయిర్‌ టెల్ బ్యాంకులు ఓపెన్ కానున్నాయి. అనంతరం దేశమంతటికీ బ్యాంకు సేవలను విస్తరించే యోచనలో ఎయిర్‌ టెల్ ఉన్నట్టు తెలిసింది. క్యాష్ లెస్ పేమెంట్లను ఎక్కువగా చేసే వారి కోసం ఈ బ్యాంకులు ఉపయోగపడతాయని ఎయిర్‌ టెల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News