ఎయిర్ టెల్ బ్యాంక్ !

Update: 2016-12-12 07:03 GMT
మొబైల్ సేవ‌ల దిగ్గ‌జం ఎయిర్ టెల్ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌లో భాగంగా ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ పేరుతో  దేశంలో తొలి చెల్లింపుల బ్యాంక్ గుర్తింపు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సేవలను త్వరలోనే తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల‌కు సైతం విస్తరించనుంది. వారం రోజుల్లో సేవలను దక్షిణాది రాష్ట్రాల‌కు విస్తరిస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ సీఈవో శశి అరోరా తెలిపారు.

త‌మ వ్యాపార సేవ‌ల విస్త‌ర‌ణ‌లో భాగంగా తొలుత తెలంగాణ, ఏపీల్లోని 20 వేల రిటైల్ కేంద్రాల్లో పేమెంట్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో 15 వేల కేంద్రాల్లో సేవలను పెడతామన్నారు. ఈ రిటైల్ కేంద్రాల నుంచే నగదు జమ, ఉపసంహరణ వంటి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. సంస్థ తొలుత రాజస్థాన్‌లో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభించింది. సర్వీసులు ఆరంభించిన తొలి పక్షంలోనే లక్ష సేవింగ్స్ ఖాతాలను తెరిచినట్లు సంస్థ ప్రకటించింది.

ఇప్ప‌టివ‌ర‌కు పైలెట్ ప్రాజెక్టు కింద అమ‌లు అవుతున్న ప్ర‌కారం...ఎయిర్‌టెల్ ఫోన్ నంబర్లు ఉన్న వారు ఆ నంబర్లనే తమ అకౌంట్ నంబర్లుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లలో వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు కాని వారు ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పిస్తే వారు కూడా ఎయిర్‌టెల్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లలో వినియోగదారులు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అందుకు గాను వారికి 7.25 శాతం చొప్పున వడ్డీ కూడా లభిస్తుంది. నగదును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే దేశంలోని ఏ బ్యాంక్ ఖాతాకైనా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో బిల్ పేమెంట్స్ చేయవచ్చు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం ఎయిర్‌టెల్ మనీ యాప్ ఉపయోగపడుతుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లలో ఖాతాలు ఓపెన్ చేసే వారికి రూ.1లక్ష విలువ గల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభ్యమవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో జట్టుకట్టి బ్యాంకింగ్ సేవలను ఎయిర్‌టెల్ అందిస్తోంది.  క్యాష్ లెస్ పేమెంట్లను ఎక్కువగా చేసే వారి కోసం ఈ బ్యాంకులు ఉపయోగపడతాయని ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News