వేల కోట్లకు ఆస్తికి వారసుడు.. ఆ బౌద్ధ సన్యాసి

Update: 2020-01-24 05:06 GMT
వేలాది కోట్ల రూపాయిలకు అధిపతి. అతని సంపదతో లెక్కేస్తే.. మలేషియా సంపన్నుల్లో రెండో స్థానం. ప్రపంచ సంపన్నుల్లో 89వ ప్లేస్. ఆయిల్.. మీడియా.. గ్యాస్.. టెలీ కమ్యునికేషన్ లాంటి ఎన్నో వ్యాపారాలు నిర్వహించే అతడు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడేయగలరు. ఇదంతా చూసినప్పుడు ఆయన .. ఏ గంటలో ఏ దేశంలో.. ఎవరితో మీటింగ్ లో ఉంటారో చెప్పటం కష్టమన్నంత బిజీగా ఉన్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అలాంటి వ్యక్తే అయితే.. ఈ స్టోరీలో ఆయన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు కూడా.

అంతులేని సంపద. అందుకు మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కాదనుకొని తనదైన జీవితాన్ని గడుపుతూ.. అడవుల్లో కందమూలాలు తింటూ సన్న్యాసిగా జీవిస్తున్న అతడి వైనం ఒక సంచలనం. ఆధునిక ప్రపంచ సిద్ధార్దుడిగా పలువురు అభివర్ణించే అతడే.. అజాన్ సిరిపన్నో. థాయ్ భాషలో అజాన్ అంటే గురువు అని అర్థం. మనకు అర్థమయ్యేలా అన్వయించుకొని చెప్పాలంటే స్వామి సిరిపన్నో అని చెబితే సరిపోతుంది.

అన్ని వ్యాపారాలు ఉండి కూడా ఇలా బౌద్ధ సన్యాసిగా  ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సమాధానం షాకింగ్ గా ఉండటమే కాదు.. సినిమాటిక్ గా అనిపించక మానదు. సిరిపన్నో కుటుంబ సంప్రదాయం ప్రకారం ఏటా తమ పూర్వీకుల్ని స్మరించుకునే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అలా 1989లో జరిగిన కార్యక్రమంలో తన తల్లితో పాటు సిరపన్నో కూడా అందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పెళ్లికి ముందు యువకులు రెండు వారాలు బౌద్ధ సన్యాసిగా  అడవిలోని ఆశ్రమంలో గడపటం థాయ్ సాంప్రదాయం.

పద్దెనిమిదేళ్ల వయసులో సరదా కోసం ఆయన రెండు నెలల తాత్కాలిక దీక్షను తీసుకున్నారు. ఆ సమయంలో  ఆయనకు తానిలా అవుతానని.. తన జీవితాన్ని బౌద్ధ గురువుగా అంకితం చేస్తానని ఆయనెప్పుడూ అనుకోలేదు కూడా. కుర్రాడిగా ఉన్నప్పుడు సరదా కోసం తీసుకున్న దీక్షలో భాగంగా ఆయనకు.. ఆ పద్దతులన్ని కొత్తగా అనిపించాయి. బౌద్ధ సన్న్యాసుల వద్ద అజాన్ చాహ్ అనే విశిష్ట ధ్యాన పద్దతిని నేర్చుకున్నారు. ఈ ధ్యానానికి కారణమైన అజాన్ చాహ్ ను కలిశారు. అప్పటికే వయసు మీద పడి.. అనారోగ్యంతో ఉన్న ఆయనతో మాట్లాడే అవకాశం సిరిపన్నోకు లభించింది. అది ఆయన జీవితాన్ని మార్చేసింది.

ఆయనతో మాట్లాడిన మాటలతో ఆయన ఆలోచనల్ని పూర్తిగా మార్చేయటంతో పాటు.. తన జీవితాన్ని బౌద్ధానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. సరదాగా రెండు వారాలు అనుకున్నది జీవితాతం అదే తోడైంది. ఇప్పటికి ఆయన సన్న్యాసాన్ని స్వీకరించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఒకపూట మాత్రమే ఆహారం తీసుకునే విధానం.. ఒంటి మీద ఒక్క జత వస్త్రాలు.. తల్లిదండ్రులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే కలవటం.. బౌద్ధ సన్న్యాసులు విధిగా పాటించే నియమాల్ని ఏ మాత్రం పొల్లుపోకుండా పాటిస్తుంటారు.

తన తండ్రి ఆనందకృష్ణన్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కోరుకున్నట్లే సిరపన్నో ప్రైవేటు జెట్ లో ఇటలీకి వెళ్లి.. ప్రముఖ స్టార్ హోటల్లో బస చేవారు. అయినప్పటికీ.. ఒకే ఒక్క వస్త్రంతో.. చిన్న చేసంచితో ఆయన స్టార్ హోటల్లో బస చేశారట. ప్రైవేటు జెట్ లో ప్రయాణించే ఏకైక బౌద్ద గురువు సిరిపన్నో ఒక్కరేనని చెబుతారు. వేల కోట్ల ఆస్తిని వదిలి.. నిరాడంబరంగా గడిపే సిరిపన్నోను చూసినప్పుడు అధునిక జీవితంలో సిద్ధార్ధుడు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.
Tags:    

Similar News