మలాలాకు దోవల్ ఘాటు పంచ్ ఇచ్చారా?

Update: 2019-08-09 05:24 GMT
కశ్మీర్ పై తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే. దీనికి సంబంధించిన స్పందనలు.. ప్రతి స్పందనలతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఓపక్క జమ్ముకశ్మీర్ లో నిషేదాజ్ఞలు అమలవుతున్న వేళ.. సగటు కశ్మీరీల స్పందన ఏమిటన్నది బయటకు రాలేదు. దీనికి తోడు.. మీడియా మీద కూడా అప్రకటిత ఆంక్షలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ.. వాతావరణం చూస్తే అలాంటిది ఉన్నట్లుగా కనిపించని పరిస్థితి. ఎందుకంటే.. కశ్మీర్ నుంచి గ్రౌండ్ రిపోర్టుల పేరుతో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు ప్రచురితమవుతున్నాయి. అక్కడి పరిస్థితి గురించి వివరాలు బయటకు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరి కంటిని ఆకర్షిస్తున్న ఈ ట్వీట్ జాతీయ భద్రతా సలహాదారు.. ఇండియన్ జేమ్స్ బాండ్ గా అభివర్ణించే అజిత్ దోవల్ చేసిన ట్వీట్ గా చెబుతున్నారు. నోబెల్ గ్రహీత.. ఐక్యరాజ్య సమితి శాంతి సందేశ వాహకురాలు మలాలా తాజాగా ఒక ట్వీట్ చేశారు. దక్షిణాసియా తన ఇల్లు అని.. అందులో 180 కోట్ల మంది ప్రజలు ఉన్నారని.. అందులో కశ్మీరీలు కూడా ఒక భాగంగా ఆమె పేర్కొన్నారు.

అందరూ కలిసి శాంతియుతంగా జీవించగలమన్న నమ్మకం తనకుందన్నారు. కశ్మీరీ మహిళలు.. బాలల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సంఘర్షణలో మహిళలు.. బాలలే ఎక్కువగా బాధితులయ్యే అవకాశం ఉందన్న వ్యాఖ్యను చేశారు. ఏడు దశాబ్దాల నుంచి ఉన్న కశ్మీరు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ట్వీటారు. మాలాలా ట్వీట్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉగ్రదాడిలో ప్రాణాపాయం నుంచి కాస్తలో తప్పించుకున్న ఆమె.. కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాల్సిన దానికి బదులుగా తనదైన రీతిలో నీతులు చెప్పటం ఈ సందర్భంలో నప్పలేదన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఇంకో వర్గం మాత్రం ఆమె ఆచితూచి స్పందించారన్న మాటను చెబుతున్నారు.

ఏదిఏమైనా మాలాలా ట్వీట్ పై భారతీయుల్లో ఎక్కువమంది గుర్రుగా ఉన్నారన్న అభిప్రాయం ఉంది. దీనికి బలం చేకూరేలా తాజాగా ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. అజిత్ దోవల్ చేసినట్లుగా చెప్పే ఈ ట్వీట్ లో మాలాలా వైఖరిని తప్పు పట్టటం కనిపిస్తుంది. అయితే.. ఆ ట్వీట్ అధికారికమా? కాదా?  అన్నది తేలలేదు. ఇక.. ట్వీట్ లో ఏమున్నదన్నది చూస్తే.. ‘‘పాకిస్థాన్‌ లో కాల్పులకు గురై - భద్రతా కారణాలతో పాకిస్థాన్‌ ను వదిలిపెట్టి - ప్రస్తుతం బ్రిటన్‌ లో స్థిరపడిన బాలిక ట్వీట్ చేస్తోంది. తన సొంత దేశంలో నివసించలేకపోయిన వ్యక్తి లక్షలాది మంది ప్రజలను అక్కడ నివసించాలని కోరుతున్నారు. ముందు మీరు పాకిస్థాన్‌ లో స్థిరపడాలని మీకు సవాల్ చేస్తున్నాను’’ అని ఉంది. ఈ ట్వీట్ (@AjitKDoval_NSA)  అకౌంట్ పేరుతో ఉంది. నిజంగానే అజిత్ దోవల్ చేశారా?  లేదా?  అన్నది పక్కన పెడితే.. ఇందులోని కంటెంట్ కు పలువురు కనెక్ట్ అవుతున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News