ముకేశ్ పిల్లల దెబ్బకు ప్రత్యర్థులకు 12 వేల కోట్ల లాస్

Update: 2016-09-01 11:18 GMT
దేశమంతా సంచలనం రేపుతున్న రిలయన్సు జియో డాటా ప్యాకేజీలు మిగతా టెలికాం ఆపరేటర్లను ఒక్క రోజులోనే దారుణంగా దెబ్బతీశాయి. పోటీ సంస్థలైన ఎయిర్ టెల్ - ఐడియా వంటి కంపెనీలను దారుణంగా దెబ్బతీసిన ఈ జియో ప్లాను కాకలు తీరిన ముకేశ్ అంబానీది కాదట. రిలయన్సులో ఇంకా పూర్తిగా రాటుదేలని ముకేశ్ పిల్లల తడాఖా అట. అవును...  రిలయన్స్ జియోలో రెండేళ్ల క్రితం ముకేశ్ కుమారుడు ఆకాశ్ - కుమార్తె ఈషా డైరెక్టర్లుగా చేరారు.  వారిద్దరి ఆలోచనే ఈ జియో ప్లాను అని రిలయన్సు అధినేత ముకేశ్ ప్రకటించారు. జియో డేటా టారిఫ్ ల రూపకల్పన అంతా వారే చూసుకున్నారని ఆయన చెప్పారు.

కాగా డాటా వాడకం కోసం భారతీయ యువత ఎంత ఖర్చు చేస్తున్నారు... సగటున ఎంత డాటా వాడుతున్నారన్న విషయంలో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించారు.  భారత్ లో స్మార్ట్ ఫోన్ వినయోగదారుల సగటు వయసులోనే ఉన్న ఆకాష్ - ఈషాలు యువతరానికి ప్రతినిధులని ముఖేష్ చెప్పారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే ఉంటారని ముకేశ్ అభిప్రాయపడ్డారు. జియో రాకతో ఇండియాలో డాటాగిరీ మొదలవుతుందని ఆయన అన్నారు.

ఆకాష్ - ఈషాలు సృష్టించిన సంచలనం గురించి ముకేశ్ ఉద్వేగంగా వివరిస్తున్న సమయంలో మార్కెట్లు షేకయ్యాయి. రిలయన్స్ జియోను పరిచయం చేస్తూ - తామందించే వివిధ ప్యాకేజీల గురించిన వివరాలను ముఖేష్ అంబానీ వెల్లడిస్తున్న వేళ - ఐడియా సెల్యులార్ - భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు రూ. 12 వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 9 శాతం వరకూ దిగజారింది. ఆపై భారతీ ఎయిర్ టెల్ కొద్దిగా నిలదొక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద - భారతీ ఎయిర్ టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 వద్దా కొనసాగుతున్నాయి.  అత్యధికంగా నష్టపోయిన టాప్-2 కంపెనీల్లో ఐడియా - ఎయిర్ టెల్ నిలిచాయి. కాగా బడా సంస్థలను ఒక్క ఆలోచనతో దెబ్బ కొట్టిన ఈషా - ఆకాష్ లు కవలలు. బ్రౌన్ యూనివర్సిటీలో ఆకాష్  గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగా  ఈషా యెల్ యూనివర్సిటీలో చదువుకుంది.  ఈషా బిజినెస్ విశ్లేషకురాలిగానూ పనిచేసింది.  రెండేళ్ల క్రితమే వీరు రిలయన్సులో డైరెక్టర్లుగా అడుగుపెట్టారు. ఇప్పుడు పెను సంచలనంగా మారారు.
Tags:    

Similar News