అక్బ‌రుద్దీన్ ల‌క్ష కోట్ల కుంభ‌కోణం లెక్క విన్నారా?

Update: 2016-03-14 10:46 GMT
అంకెలు చాలా చిత్ర‌మైన‌వి. తెలివిగా లెక్క చెప్పాలే కానీ.. అంకెల గార‌డీ క‌ష్ట‌మేమీ కాదు. కంటికి క‌నిపించే అంకెల్ని వాద‌న‌కు త‌గిన‌ట్లుగా మార్చుకునే వీలుంటుంది. అలాంటి చిత్ర‌మైన లెక్క‌నే తాజాగా చెప్పుకొచ్చారు మ‌జ్లిస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత అక్బ‌ర్దుదీన్ ఓవైసీ. రాజ‌కీయాల్లో ల‌క్ష కోట్లు ఫ్యాన్సీ మాట‌గా మారిపోయి.. ప్ర‌తి ఆరోప‌ణను చివ‌ర‌కు రూ.ల‌క్ష కోట్ల‌కు తీసుకురావ‌టం.. అమ్మో అంత పెద్ద మొత్త‌మా? అన్న ప్ర‌శ్న వ‌చ్చేలా చేయ‌టం  ఒక అల‌వాటుగా మారిన ప‌రిస్థితి. తాజాగా అలాంటి హ‌డావుడి లెక్క‌నే చెప్పుకొచ్చారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ.

చ‌క్క‌టి ఇంగ్లిషుతో దంచి కొట్టేయ‌గ‌ల వాక్ చాతుర్యం ఉన్న అక్బ‌ర్‌.. ప్ర‌భుత్వాన్ని పొగిడేయ‌గ‌ల‌రు.. అదే స‌మ‌యంలో తిట్టేయ‌గ‌ల‌రు కూడా.  ఇష్యూ ఏదైనా త‌మ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తిన‌కుండా ఉండేలా ఉండాల‌న్న‌దే ఆయ‌న ప్ర‌య‌త్నం. అందులో భాగంగానే ఆయ‌న మాట‌లు ఉంటాయి. మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్పు గురించి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న అక్బ‌రుద్దీన్‌.. తాజాగా అది ల‌క్ష కోట్ల రూపాయిల కుంభ‌కోణంగా అభివ‌ర్ణించి.. అవాక్కు అయ్యేలా చేశారు. ల‌క్ష కోట్ల మాట‌ను విన్న వెంట‌నే అంద‌రూ అలెర్ట్ అయిపోయే ప‌రిస్థితి. అక్బ‌రుద్దీన్ చెప్పిన‌ట్లుగా ల‌క్ష కోట్ల లెక్క ఏందో చూస్తే.. న‌వ్వురాక మాన‌దు.

మెట్రో ప్రాజెక్టును రూ.14,132 కోట్ల అంచ‌నాతో ప్రారంభిస్తే.. అందులో రూ.12,654 కోట్లను మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ఖ‌ర్చు చేయ‌నుంది. ఇందుకోసం.. ఈ సంస్థ‌కు 37 ఏళ్ల పాటు దాని మీద ఆదాయం పొందే వీలుంది. అలా పొందే ఆదాయం రూ.1,18,892 కోట్లు వ‌స్తుంద‌ని.. అంటే.. పెట్టుబ‌డి పెట్టిన రూ.12.6వేల కోట్ల‌కు రూ.1.18ల‌క్ష‌ల కోట్ల ఆదాయ‌మా? అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. అక్బ‌ర్ ఆరోప‌ణ‌ల్ని య‌థాత‌ధంగా చూస్తే వామ్మో అనిపించ‌క మాన‌దు. కానీ.. వాస్త‌వ కోణంలో చూస్తే అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది.

అక్బ‌రు లెక్క‌లు 66 స్టేష‌న్ల‌లో 18.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో వాణిజ్య కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని వాటి ద్వారా రూ.17వేల కోట్ల ఆదాయం.. పార్కింగ్ కింద రూ.170కోట్లు.. మెట్రో ఫిల్ల‌ర్ల మీద ప్ర‌చారంతో రూ.3వేల కోట్లు.. టిక్కెట్ల చార్జీల కార‌ణంగా వ‌చ్చే ఆదాయం రూ.1.18 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం రానుంది.

అయితే.. ఇంత ఆదాయం 37 ఏళ్ల‌కు అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇప్పుడు చూస్తున్న మెట్రో ప్రాజెక్టు నిర్మాణం న‌గ‌రంలో ఎన్ని రోజులుగా జ‌రుగుతుందో అంద‌రికి తెలిసిందే. ఏళ్ల‌కు త‌ర‌బ‌డి సాగుతున్న మెట్రో నిర్మాణం కోసం పెట్టిన ఖ‌ర్చుకు అయ్యే వ‌డ్డీ.. పెట్టే పెట్టుబ‌డి వ‌డ్డీ మొత్తం ఏం కావాలి? ఒక ఇంటిని కొనుగోలు చేసే స‌మ‌యంలో బ్యాంకు ద‌గ్గ‌ర అప్పు చేస్తే 10 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కూ వాయిదాల రూపంలో అప్పు తీర్చాల్సి ఉంటుంది. తీసుకున్న అప్పుకు.. చెల్లించే మొత్తాన్ని లెక్క వేస్తే గుండె గుభేల్ మంటుంది. అలా అని.. అప్పు తీసుకోకుండానే అంద‌రూ ఇళ్లు కొనుగోళ్లు చేస్తున్నారా? అన్న ప్ర‌శ్న వేసుకుంటే అన్స‌ర్ ఎవ‌రికి వారికి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అక్బ‌రుద్దీన్ మాట‌లు కూడా ఇంచుమించు ఇలానే ఉంది.

వేల కోట్ల రూపాయిలు పెట్టుబ‌డులుగా పెట్టి ఒక ప్రాజెక్టును ఏళ్ల త‌ర‌బ‌డి నిర్మిస్తే.. దాని కార‌ణంగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొంద‌కుండా కేవ‌లం సేవ కోసమే ఎల్ అండ్ టీ కంపెనీ త‌న వ్యాపారాన్ని స్టార్ట్ చేయ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అయినా.. ల‌క్ష కోట్ల కుంభ‌కోణం లెక్క ఇప్పుడే అక్బ‌రుద్దీన్ కి ఎందుకు గుర్తుకు వ‌చ్చిన‌ట్లు? ఇప్ప‌టివ‌ర‌కూ ఆ సోయి ఏమైంది..?
Tags:    

Similar News