కేసీఆర్ కు మంట పుట్టేలా మాట్లాడాడు

Update: 2016-03-20 04:35 GMT
వియ్యానికైనా.. కయ్యానికైనా సమఉజ్జీ ఉంటే ఆ మజానే వేరు. తిరుగులేని రాజకీయశక్తిగా మారి చెలరేగిపోతున్న తెలంగాణ అధికారపక్షానికి మిత్రుడిగా ఉండే అద్భుత అవకాశం మజ్లిస్ కు మాత్రమే దక్కింది. అధికారపక్షంలో ఉన్న వారితో చెట్టాపట్టాలు వేసుకొని తిరగటం మజ్లిస్ కు మొదట్నించి అలవాటే. అంతేకాదు.. మిత్రపక్షంగా ఉంటూ చురకలు పెట్టటం.. అవసరం.. అవకాశాన్ని బట్టి చెలరేగిపోయేలా మాట్లాడటం మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి అలవాటే.

తాజాగా ఆయన తనలోని విభిన్న కోణాన్ని బయటకు తీశారు. తెలంగాణ ప్రభుత్వానికి మిత్రుడిగా ఉంటానని చెప్పే అక్బరుద్దీన్ ఓవైసీ.. ప్రభుత్వంపై ఏ రేంజ్ లో చెలరేగిపోయారో చూస్తే నోట మాట రాని పరిస్థితి. విపక్షం కంటే కూడా ఎక్కువగా చెలరేగిపోయిన అక్బరుద్దీన్ తన ప్రసంగంతో అధికారపక్షాన్ని కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ‘‘టీఆర్ ఎస్ కు మేం ఎప్పటికీ మిత్రులమే. ప్రభుత్వ పని తీరు బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకం ఉంది. మైనార్టీలకు ఈ ప్రభుత్వం చాలానే చేస్తుంది. కానీ..’’ అంటూనే చిట్టా విప్పి తెలంగాణ అధికారపక్షానికి చుక్కలు చూపించటం అక్బరుద్దీన్ కే సాధ్యమేమో..?

బడ్జెట్ పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. లేవనెత్తిన అంశాల్ని చూస్తే..

= అటుకేంద్రం పథకాల్లో కోత పెడుతోంది. దీంతో రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభావం పడుతోంది. ఆదాయం అనుకున్నంతగా పెరగటం లేదు. రాబడి లక్ష్యాల్ని సాధించటంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు విఫలమవుతున్నాయి. అయినా.. భారీ అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టటం ఆశ్చర్యకరం.

= రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. కానీ.. వ్యవసాయం కుదేలైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగింది. హైదరాబాద్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

= రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. భారీస్థాయిలో అప్పులు తెస్తామంటున్నారు. ఏయే సంస్థలకు ఎంత మొత్తంలో అప్పులు తెస్తున్నారో వివరాలు ఇవ్వండి.

= ఇంధన శాఖకు కేటాయింపులు చూస్తే.. గృహ విద్యుత్తు ఛార్జీలు మోగిపోవటం ఖాయమని తేలిపోయింది. ఆస్తిపన్ను.. నీటిపన్ను.. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ప్రభుత్వం హామీ ఇవ్వాలి.

= ఐదేళ్లలో ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీల కోసం లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తామన్నారు. కానీ.. ఇప్పటివరకూ రూ.31వేల కోట్లే ఖర్చు చేశారు. మరి మిగిలినవి రెండేళ్లలో ఖర్చు చేస్తారా?

= మైనార్టీ విద్యార్థుల ఫీజుబకాయిల కోసం రూ.40 కోట్లు విడుదల చేస్తే ఊపిరి పీల్చుకుంటారు. మైనార్టీల కోసం అధికారులు పని చేయటం లేదు.

= ఇన్ని సమస్యలు ఉంటే కొత్తగా సచివాలయం.. కొత్తగా అసెంబ్లీ కట్టాలన్న ఆలోచనలెందుకు?

= విద్యాశాఖకు ఇచ్చిన నిధులన్నీ జీతాలకే పోతున్నాయి.

= మిషన్ భగీరధలో హైదరాబాద్ ను కూడా చేర్చండి

= డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం సరిగా చేయకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News