గులాబీ ద‌ళం సిగ్గు ప‌డేలా చేసిన అక్బ‌రుద్దీన్‌

Update: 2017-11-09 04:30 GMT
గులాబీ ద‌ళం సిగ్గు ప‌డేలా చేసిన అక్బ‌రుద్దీన్‌
  • whatsapp icon
బుధ‌వారం తెలంగాణ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ లేని రీతిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు మ‌జ్లిస్ ప‌క్ష నేత అక్బ‌రుద్దీన్‌. తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు సైతం త‌మ అధినేత‌ను ఎప్పుడూ పొగ‌డ‌నంత రీతిలో అక్బరుద్దీన్ పొగిడేశారు.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేసీఆర్ కు చిన్న‌ద‌ని.. 2019లో టీఆర్ఎస్‌.. మ‌జ్లిస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంద‌న్న విష‌యాన్ని నిండు అసెంబ్లీలో ఓపెన్ గా ప్ర‌క‌టించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేసిన అక్బ‌రుద్దీన్‌.. పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల విష‌యంలోనూకేసీఆర్ తీరును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

2019 ఎన్నిక‌ల త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కీల‌క భూమిక పోషిస్తారంటూ జోస్యం చెప్పిన అక్బ‌రుద్దీన్‌.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వ‌లేద‌ని.. తెలంగాణ రాస్ట్రాన్ని ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిని కేసీఆర్ సృష్టించార‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాల‌న‌లో బాబ్రీ మ‌సీదును కూల్చివేసిన వేద‌న మిగ‌ల్చ‌టం త‌ప్ప ముస్లింల‌కు చేసిందేమీ లేద‌న్నారు. త‌న ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. కాంగ్రెస్ నేత‌ల ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. మీరు చెప్పండి.. నేను కూర్చుంటానంటూ స్పీక‌ర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ముస్లింల‌కు.. విదేశాల‌కు వెళ్లి చ‌దువుకోవాల‌నుకునే యువ‌త‌కు కేసీఆర్ అండ‌గా నిలుస్తున్నారంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అధికార‌ప‌క్షంతో రాసుకుపూసుకు తిరిగే అల‌వాటు మ‌జ్లిస్ కు మామూలే. అయితే.. గ‌తంలో ఎప్పుడూ లేనంత భారీగా ముఖ్య‌మంత్రిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌టం ఇదే తొలిసారిగా చెప్పాలి.

ఈ రోజు కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్న అక్బ‌రుద్దీన్ మ‌రీ.. కిర‌ణ్ కుమార్ రెడ్డికి ముందు వ‌ర‌కూ అదే పార్టీతో ఎలా అంట‌కాగారో చెప్పాలి.

2009 ఎన్నిక‌ల వేళ‌లో కాంగ్రెస్ పార్టీతో చెట్టాప‌ట్టాలేసుకున్న‌ప్పుడు అక్బ‌ర్ సాబ్‌ కు కాంగ్రెస్ దుర్మార్గాలు గుర్తుకు రాలేదా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిందే. ఇప్పుడొచ్చి 70 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న అంటూ లెక్క‌లు తీస్తున్న అక్బ‌రుద్దీన్‌.. అందులో తాము మ‌ద్ద‌తు ఇచ్చిన కాలానికి ఏం బ‌దులిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఇంత‌కీ.. గులాబీ నేత‌లు సైతం పొగ‌డ‌లేనంత భారీగా పొగిడేసి.. వారికి అసూయ క‌లిగించేలా చేసిన అక్బ‌రుద్దీన్‌.. ఉన్న‌ట్లుండి అంత భారీగా ముఖ్య‌మంత్రివారిని ఎందుకు పొగిడిన‌ట్లు? అన్న సందేహాన్ని చూస్తే.. త‌న ప్ర‌సంగంలో ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు.

బ‌డ్జెట్‌ను కాద‌ని మ‌రీ మ‌క్కా మ‌సీదు అభివృద్ధికి నిధులు ఇచ్చార‌ని.. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు బ‌కాయిలు పెడుతూ వ‌చ్చిన రూ.4వేల కోట్ల‌ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారంటూ అస‌లు విష‌యాన్ని చెప్పారు. పొగ‌డ్త‌ల‌తో కేసీఆర్ మ‌న‌సును గెలుచుకొని మ‌రిన్ని ప‌నులు చేయించుకోవ‌టానికి వీలుగా త‌న కోర్కెల చిట్టాను విప్పారు.  అందులోని ముఖ్య‌మైన‌వి చూస్తూ.. ఉద్దూను కూడా అధికార‌భాష‌గా ప్ర‌క‌టించాల‌ని.. ముస్లిం విద్యార్థుల‌కు సంబంధించి మ‌రో రూ.239 కోట్ల బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని.. వ‌క్ఫ్ స్థ‌లాల అభివృద్ధికి నిధులు విడుద‌ల చేయాల‌ని.. వివిధ జిల్లాల్లో వ‌క్ఫ్ భూములు అన్యాక్రాంత‌మ‌య్యాయ‌ని.. వాటిని వ‌క్ప్ బోర్డుకు చేర‌వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఏ మాట‌కు ఆ మాటే.. అక్బరుద్దీన్ పొగిడిన స్థాయి చూసిన‌ప్పుడు.. ఆయ‌న కోరిన కోర్కెల చిట్టా చిన్న‌దేన‌న్న మాట అసెంబ్లీ లాబీల్లో రాజ‌కీయ నేత‌లు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News