తెలుగుపై మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ దంచేశారుగా!

Update: 2017-11-29 10:01 GMT
ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి, క‌ర్నూలుకు చెందిన సీనియ‌ర్ నేత దివంగ‌త భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ‌కు టీడీపీ ఎమ్మెల్యేలే చుర‌క‌లంటించేశారు!  ``తెలుగంటే.. ఇంగ్లీష్ కాద‌మ్మా`` అంటూ అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేశారు. దీంతో తీవ్రంగా ఇరుకున ప‌డిపోయిన అఖిల ప్రియ తేరుకుని గ్లాసుడు నీళ్ల‌ను గ‌ట‌గ‌టా తాగేశారు. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన ఈ ఘ‌ట‌న ఏకంగా ఏపీ అసెంబ్లీలో బుధ‌వారం చోటు చేసుకుంది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం `తెలుగు భాష‌` అంశంపై స‌భ్యులు చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు స‌భ్యులు తెలుగు భాష అభ్యున్న‌తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు.

మ‌న‌క‌న్నా.. తెలంగాణ ప్ర‌భుత్వ‌మే ఉన్నత స్థాయి విద్య వ‌ర‌కు తెలుగును త‌ప్ప‌నిస‌రి చేసింద‌ని కూడా అధికార ప‌క్ష టీడీపీ స‌భ్యులు స‌భ‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మయంలో ఏపీలో తెలుగును ఎలా ర‌క్షించుకోవాల‌నే అంశంపై ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా ఇచ్చారు. ఇటీవ‌ల మున్సిప‌ల్ స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియాన్ని త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని స‌భ్యులు ఈసం ద‌ర్భంగా తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. జీవో నెంబ‌రు 12ను త‌క్ష‌ణమే వెన‌క్కి తీసుకుని, తెలుగునే త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక‌, ఈ చ‌ర్చ‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల ప్రియ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె సుదీర్ఘంగా మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, అనూహ్యంగా ఆమె ప్ర‌సంగానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే చుర‌క‌లంటించ‌డంతో మంత్రి నివ్వెర పోయారు.

చర్చ సందర్భంగా తెలుగుపై మాట్లాడిన మంత్రి అఖిల ప్రియ‌.. ఇకపై  ప్ర‌భుత్వంలోని అన్ని శాఖలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అయితే, ఆమె ప్రాధాన్యం మాట బ‌దులుగా `ఇంపార్టెన్స్‌` అని అన‌డంతో.. ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్‌ శివాజీ చురకలంటించారు. `తెలుగంటే.. తెలుగులోనే మాట్లాడాలి మేడం. ఇంగ్లీష్ కాదు!` అని అనే స‌రికి అఖిల ప్రియ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అయినా ఆగ‌ని శివాజీ.. తెలుగు మాట్లాడాలని చెప్పే మంత్రి అఖిల ప్రియే సభలో ఆంగ్లంలో చెబుతున్నారని తప్పుబట్టారు. ముందు మంత్రులు అసెంబ్లీ లో కూడా ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. ఊహించ‌ని ప‌రిణామంతో బిత్త‌ర పోయిన అఖిల వెంట‌నే మంచినీళ్లు తాగి ప్ర‌సంగం కొన‌సాగించ‌డంతో స‌భ్యులు ముసిముసిగా న‌వ్వుకోవ‌డం క‌నిపించింది.

Full View
Tags:    

Similar News