సుబ్బారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌పై అఖిల‌ప్రియ ఏమందంటే..?

Update: 2020-06-05 18:23 GMT
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కురాలు భూమా అఖిల‌ప్రియ.. త‌మ పార్టీకే చెందిన ఏవీ సుబ్బారెడ్డి నుంచి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అఖిల ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ‌రామ్ క‌లిసి త‌న‌ను హ‌త్య చేయించేందుకు కుట్ర ప‌న్నార‌ని అత‌ను ఆరోపించాడు. త‌న‌ ముగ్గురు కూతుళ్లతో సమానంగా అఖిలప్రియను ప్రేమగా చూసుకున్నానని... రాజకీయ కుట్రతోనే అఖిలప్రియ త‌న‌ హత్యకు ప్రణాళిక రచించింద‌ని.. ఇందుకోసం రూ.50 ల‌క్ష‌ల‌తో సుపారీ కూడా కుదుర్చుకుంద‌ని.. త‌క్షణమే అఖిలప్రియను, ఆమె భర్త భార్గవ రామ్‌ను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశాడు. సంచ‌ల‌నం రేపిన ఈ ఆరోప‌ణ‌ల‌పై అఖిల‌ప్రియ స్పందించింది.

భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరిట ఉండ‌టం వ‌ల్ల అత‌డి హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను అఖిల ప్రియ ఖండించారు. భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంటే అవి ఏవీ కుటుంబానికే చెందుతాయని.. త‌మతో ఆస్తి గొడవలు లేవని ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పాడని అఖిలప్రియ గుర్తుచేశారు. సుబ్బారెడ్డికి పదవులు ఇస్తే తాను అడ్డుకోలేదని ఆమె అన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని చెప్పలేదని, అలా చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తాడో చూడాలని ఉందని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని అఖిల‌ప్రియ చెప్పింది. త‌న భ‌ర్తకు వేరే కేసులో బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేశామ‌ని.. ఆ కేసును పక్కదారి పట్టించేందుకే సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అఖిలప్రియ చెప్పారు.
Tags:    

Similar News