ఇంట‌రెస్టింగ్!..అఖిలేష్‌-ములాయం క‌లిశారు!

Update: 2017-09-28 16:54 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు! వాస్త‌వానికి రాజ‌కీయాల్లో త‌లెత్తిన వివాదాలు రాజ‌కీయంగానే కొట్టుకుపోతాయి. ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నేత చెప్పిన‌ట్టు.. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, తిట్ల దండ‌కాలు వంటివి తాటాకు మంట‌ల్లాంటివి. అవి అప్ప‌టిక‌ప్పుడు అలా ఎగిసి ఇలా చ‌ల్లార‌తాయి. భోగి మంట‌లుగా చూడ‌డం మ‌న త‌ప్పే! ఇప్పుడు ఇలాంటి సీన్ ఒక‌టి యూపీలో క‌నిపించింది. గ‌డిచిన 7 మాసాల కింద‌ట దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి సీఎం అఖిలేష్ యాద‌వ్‌ - ఆయ‌న తండ్రి ములాయం సింగ్‌ ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ - న‌డిచిన కామెంట్లు అంతా ఇంతా కాదు.

ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. కౌంట‌ర్లు విసురుకున్నారు. ఇక‌, తండ్రి స్థాపించిన పార్టీని సైతం అఖిలేష్ పోరాడి లాగేసుకున్నాడు. ఎన్నిక‌ల్లో తండ్రి చెప్పిన వారికి టికెట్ ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం జాబితాలో పేరు కూడా లేకుండా చేశాడు. ఇంత జ‌రిగిన త‌ర్వాత ఆతండ్రీ కొడుకులు క‌లుస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటారా? ఊహించ‌గ‌ల‌రా? అంతెందుకు ఇటీవల జ‌రిగిన ప‌రిణామాల నేప‌ధ్యంలో ములాయం సొంత‌గా ఓ పార్టీని పెడుతున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఆయ‌న వాటిని ఖండించార‌నుకోండి. కానీ, ఇంత దూర‌మైతే వ‌చ్చింది క‌దా.

కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఈ తండ్రీ కొడుకుల మ‌ధ్య యూట‌ర్న్ రాజ‌కీయం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.  వచ్చేవారం ఆగ్రాలో జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ సమావేశానికి రావాలని.. ములాయంను అఖిలేష్‌ యాదవ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్టీలో తండ్రీ కొడుకుల విబేధాలు తారాస్థాయికి చేరిన తరువాత.. ఇంతటి సామరస్య పూర్వక పలకరింపులు లేవని.. ఈ ఏడు నెలల్లో ఇదే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ములాయంను ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా కలిసిన అఖిలేష్‌ యాదవ్‌ దాదాపు 20 నిమిషాల సేపు ఆయనతో చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి ఏం చర్చించారన్న విషయంపై స్పష్టత లేకపోయినా.. ఇదొక శుభపరిణామమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News