శ్రీరాముడు మా పార్టీ వాడే..: అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-12-16 16:19 GMT
బీజేపీ చేస్తున్న హిందూ రాజకీయాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు అందిపుచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అలా చేస్తేనే పార్టీలకు మనుగడ ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీరాముడు వెలిసిన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు హిందుత్వ రాజకీయం లేనేదే గెలిచే పరిస్థితి లేదు. అందుకే అక్కడి బీజేపీ సర్కార్ కు పోటీగా ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా శ్రీరాముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘శ్రీ రామచంద్రుడు మా పార్టీకి చెందిన వాడు...మేమంతా రామ భక్తులమనీ తామంతా త్వరలోనే కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముడ్ని దర్శించుకుంటాం’ అని సంచలన వ్యాఖ్యానించారు.యూపీలోని అజమ్‌గఢ్‌ నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో అఖిలేశ్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాసేపు అయోధ్యలో ఆగారు. ఈ సందర్భంగా శ్రీరాముడిని సమాజ్ వాదీ పార్టీలోకి మార్చేసి హాట్ కామెంట్స్ చేశారు.

సమాజ్ వాదీ నేతలమంతా శ్రీరాముడు, కృష్ణుడి భక్తులమని అఖిలేష్ వ్యాఖ్యానించారు. కుటుంబాలతో వచ్చి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిని సందర్శిస్తామని తెలిపారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి అఖిలేష్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. యూపీ ఎన్నికల్లో మా పార్టీ 403 సీట్లలో 351 గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News