మాకు ఫుల్ ఆర్డ‌ర్స్ ఉన్నాయి..డ్ర‌గ్స్ తాట తీస్తాం

Update: 2017-07-24 12:49 GMT
హైద‌రాబాద్‌ లో సంచ‌ల‌నం రేపిన డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ చేప‌ట్టేందుకు ఆబ్కారీ శాఖ‌కు అన్ని అధికారాలు ఉన్నాయని ఎక్సైజ్‌ ఈడీ అకున్ స‌బ‌ర్వాల్ తేల్చిచెప్పారు. 1985 నార్కోటిక్ డ్ర‌గ్స్ చ‌ట్టం ప్ర‌కార‌మే విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డ తర్వాత దానికి సంబంధించిన జీవోను 2016లో రిలీజ్ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. విచార‌ణ‌లో సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్ దాట‌లేద‌న్నారు. ప్ర‌పంచంవ్యాప్తంగా వినియోగంలో ఉన్న బెస్ట్ టెక్నిక్స్‌ను విచార‌ణ‌కు వాడుతున్న‌ట్లు అకున్ తెలిపారు. మొత్తం న‌లుగురు స‌భ్యుల‌తో విచార‌ణ కొన‌సాగుతున్న‌ద‌ని, ప్ర‌తి విచార‌ణ‌ను వీడియో రికార్డింగ్ చేస్తున్న‌ట్లు స‌బ‌ర్వాల్ తెలిపారు. విచార‌ణ‌కు హాజ‌రైన వ్య‌క్తుల నుంచి పూర్తి అంగీకారంతోనే ర‌క్త న‌మూనాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ ఎవ‌రైనా వ్య‌తిరేకిస్తే ఆ విష‌యాన్ని డిక్ల‌రేష‌న్‌ లో పేర్కోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

డ్ర‌గ్స్ కేసులో ఉన్న మైన‌ర్ల పేర్ల‌ను తాము బ‌య‌ట‌పెట్ట‌బోమ‌ని అకున్ స్ప‌ష్టం చేశారు. స్కూల్ పిల్ల‌ల భ‌విష్య‌త్తును నాశ‌నం చేయ‌డం బాగుండ‌ద‌ని, డ్ర‌గ్స్ బానిస‌లైన త‌ల్లితండ్రుల‌తో మాట్లాడుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి విచార‌ణ‌లోనూ మ‌హిళా ఆఫీస‌ర్ కూడా పాల్గొంటున్న‌ట్లు స‌బ‌ర్వాల్ చెప్పారు. సినీ న‌టి చార్మి విష‌యంలోనూ ఈ మ‌హిళా అధికారి ఉంటార‌న్నారు. చార్మి స‌హా త‌మ‌కు ఎవ‌రినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేద‌ని అకున్ స‌బ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు. త‌న‌ త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల ప‌ట్ల కూడా అకున్ స్పందించారు. తన‌కు ఎవ‌రితోనూ ప్రాణ భ‌యం లేదు అని, ఐయామ్ సేఫ్ అన్నారు. ఎన్డీపీస్ యాక్ట్ ప్ర‌కారం డ్ర‌గ్స్ అమ్మ‌డం, కొన‌డం, ఉంచుకోవ‌డం, ఇత‌రుల‌కు అల‌వాటు చేయ‌డం, వాడ‌టం నేర‌మ‌వుతుంద‌న్నారు. డ్ర‌గ్స్ కేసులో మొత్తం 27 మందిని విచారించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దాంట్లో అయిదుగురు మాత్ర‌మే సినీ ఇండ‌స్ట్రీకి చెందిన‌ట్లు చెప్పారు.

డ్రగ్స్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఎక్సైజ్ శాఖ విచారణకు చట్ట బద్ధత ఉందని ఆ శాఖ కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 27 మందిని విచారించామని చెప్పారు. ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే ప్రశ్నిస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురిని మాత్రమే విచారించామని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు బృందానికి ప్రత్యేక జీవో ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో న్యాయపరమైన సలహాల కోసం ప్రత్యేక బృందం అందుబాటులో ఉందన్నారు. విచారణకు పోలీసు, నార్కోటిక్ అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు.

అనంతరం,  డ్ర‌గ్స్ నిర్మూల‌నకు సంబంధించిన ప్రచార కార్య‌క్ర‌మాల్లో భాగంగా.... ‘డ్రగ్స్..మాదక పదార్థాలు వద్దు’, ‘సే నో టు డ్రగ్స్’ అనే తెలుగు, ఇంగ్లీషు పోస్టర్లను చంద్రవదన్, అకున్ సబర్వాల్ ఆవిష్కరించారు. భ‌విష్య‌త్తులో డ్ర‌గ్స్ నిర్మూల‌న గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించేందుకు మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తామ‌ని అకున్ తెలిపారు.
Tags:    

Similar News