ప‌ద‌వి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ!

Update: 2018-08-13 11:36 GMT
అంతులేని అభిమానానికి, అత్యంత రంజుగా సాగే రాజకీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన త‌మిళ‌నాడులో మ‌రో క‌ల‌క‌లం తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ్మ‌గా పేరొందిన అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం స‌మ‌యంలో ఆ పార్టీలో నెల‌కొన్న హైడ్రామా ఓ కొలిక్కి వ‌స్తున్న స‌మ‌యంలోనే... డీఎంకే అధినేత కరుణానిధి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న క‌న్నుమూసి వారం రోజులు గడవక ముందే...ఆ పార్టీలో సిగ‌ప‌ట్లు మొద‌ల‌య్యాయి. అధ్యక్ష పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోరు మొదలైంది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కొనసాగుతున్న ఎంకే స్టాలిన్ - నాలుగేళ్ల క్రితం పార్టీ నుంచి తొలగించబడిన కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి మ‌ధ్య ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి.

అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న క‌రుణానిధి పెద్ద‌కుమారుడు అళ‌గిరి ఇవాళ ఉదయం మేరినా బీచ్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కూడా అధ్యక్ష పదవికి అర్హుడేనని ప్రకటించుకుంటున్నారు. తమ తండ్రి మద్దతుదారులందరూ తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీలో కీలక పాత్ర పోషించాలని తనను తమిళ ప్రజలు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుందన్నారు. తప్పకుండా తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ఆళగిరి అన్నారు.

ఈ నెల 14న జరిగే డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌ను డీఎంకే అధ్యక్షుడిగా ప్రకటించాలని భావించారు. అయితే ఆళగిరిని పూర్తిస్థాయి చర్చలు జరిపి, ఆయనతో ఒక అంగీకారం కుదిరిన తర్వాతే డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ను ప్రకటించాలని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్ర‌మంలో డీఎంకేలో కుటుంబ తగాదాలకు చోటివ్వకుండా ఉండేందుకు పలువురు సీనియర్లు రంగంలోకి దిగారు. ఆళగిరిని బుజ్జగించే పనిలో సీనియర్ నేతలు పడ్డారు. ఈ క్రమంలో 14న జరిగే డీఎంకే సర్వసభ్య సమావేశంలో కేవలం కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో మరోసారి సమావేశమై డీఎంకే అధ్యక్షుణ్ని ప్రకటించే అవకాశం ఉంది.

కాగా, అళగిరి వ్యవహారంతో స్టాలిన్ గ్రూప్ అలర్టైంది. చెన్నైలోని తన ఇంట్లో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో స్టాలిన్ మంతనాలు జరిపారు. అళగిరి తిరుగుబాటు జెండా ఎగరేసిన నిమిషాల వ్యవధిలోనే స్టాలిన్ వర్గం సమావేశమైంది. ఇదంతా ముందే ఊహించిన స్టాలిన్… అళగిరికి పార్టీలో కీలకమైన పదవికి హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే తనతో పాటు తన వర్గాన్నీ అకామిడేట్ చేస్తే తప్ప చేరేది లేదని అళగిరి తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు అళగిరి రాకను డీఎంకే సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అళగిరి పార్టీలోకొస్తే అతనితో పాటు అతని వర్గాన్ని అకామిడేట్ చేయాలన్నది అళగిరి ష‌ర‌తుకు ఒప్పుకుంటే తమకు ఎక్కడ అవకాశాలు పోతాయోనన్న భయం వాళ్లను వెంటాడుతోందట. అందుకే అళగిరి రాకను వ్యతిరేకిస్తున్నారని సమాచారం.
Tags:    

Similar News