అలీకి రాజ్యసభ కాదుట...?

Update: 2022-02-17 09:30 GMT
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీకి రాజ్యసభ టికెట్ ఇస్తారని ప్రచారం విసృతంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయనకు నిజంగానే  ఆ కీలక పదవి ఇస్తారా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన నేపధ్యంలో అలీకి ఒక ప్రాముఖ్యత కలిగిన పదవి అయితే ఇస్తారని తెలుస్తోంది.

ఆ పదవి ఏంటన్నది రకరకాలుగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా సాగుతున్న ప్రచారమైతే  అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌ పదవిని ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు దాదాపుగా ఖాయమైంది అని తెలుస్తోంది. చాలా తొందరలోనే దీని మీద ఉత్తర్వులు రానున్నాయని అంటున్నారు.

ఇక అలీకి ఏదైనా ఒక  పదవి ఇవ్వాలని జగన్ భావించి ఆయంతో చర్చలు జరిపారని అంటున్నారు. అయితే తనకు ఏ పదవి అన్నది అలీ కోరుకోకపోయినా ఏదిచ్చినా ఓకే అన్నట్లుగానే చెప్పి ఉంటారని అంటున్నారు. మరో వైపు అలీ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ లోగా ఆయనకు ప్రాధ్యాన్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట. అందుకే ఏరి కోరి మరీ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమిస్తున్నారు అంటున్నారు.

ఇప్పటికే గౌతం సవాంగ్ ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించిన ప్రభుత్వం అలీకి సంబంధించిన ఉత్తర్వులను కూడా తొందరలోనే వెలువరిస్తుంది అంటున్నారు. మొత్తానికి అలీకి రాజ్యసభ అంటూ ప్రచారం జరిగినా ఇపుడు  వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా చేస్తున్నారు. ఇక ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని, ఆ మీదట మంత్రిగా పనిచేయాలని కోరికతో ఉన్నారని చెబుతున్నారు.

ఇంకో వైపు చూసుకుంటే అలీకి రాజ్యసభ ఇచ్చేందుకు మొదట  ఆలోచించినా సినీ రంగంలో కొందరు ఈ కీలక పదవిని ఆశిస్తున్నారు. వారికి ఇవ్వకుండా అలీకి ఇస్తే రాజకీయంగా కొంత వివాదం అవుతుంది అని భావించే అలీకి ఈ పదవిని ఫిక్స్ చేశారని అంటున్నారు. చూడాలి మరి అలీకి ఈ శుభ వార్త ఎపుడు చెబుతారో.

ఇంకో వైపు టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని క్రిష్ణ మురళీకి కూడా కీలకమైన పదవి ఇవ్వడానికి జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తనకు ఏ పదవీ వద్దు అని పోసాని చెప్పినా కూడా టాలీవుడ్ లో తనకు దన్నుగా మొదటి నుంచి ఉన్న వారికి పదవులు ఇవ్వడం ద్వారా టాలీవుడ్ కి ఒక సంకేతం పంపేందుకే వైసీపీ పెద్దలు ఈ పదవుల పందేరానికి తెర తీశారు అని అంటున్నారు.

Tags:    

Similar News