రోజూ హెల్మెట్ పెట్టుకునే కారును డ్రైవ్ చేస్తున్నాడట!

Update: 2019-09-10 04:53 GMT
కొత్త వాహన చట్టం ఒక ఎత్తు.. ట్రాఫిక్ పోలీసులు చేసే సిత్రాలు వైరల్ వార్తలుగా మారుతున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది పీయూష్ వర్షనీకి ఎదురైన అనుభవం. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన ఇతగాడు తన కారులో బుద్ధిగా వెళుతుంటాడు. అలాంటి ఆయనకు స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ఒక చలానా అందింది. దాని సారాంశం ఏమంటే.. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపారంటూ రూ.500 జరిమానా విధిస్తూ చలానా పంపారు. ఇంతకీ అతగాడు చేసిన తప్పేమిటన్న దగ్గర కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదని.. అందుకే ఫైన్ కట్టాలని తేల్చారు.

దీంతో ఒళ్లు మండిన పీయూష్ తనకుచలానా అందిన నాటి నుంచి కారులో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించే జర్నీ చేస్తున్నాడు. గత నెల 27న ఆయన చలానా అందుకున్నారు. అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకొని కారులో డ్రైవ్ చేస్తున్నారు. వాస్తవానికి  కారు తన తండ్రి పేరు మీద ఉందని. . ఇప్పుడాయన బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో.. తానే కారును డ్రైవ్ చేస్తున్నట్లు చెప్పారు.

మరోసారి కారులో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారంటూ ఫైన్ వేయకుండా ఉండేందుకే తానీ పని చేస్తున్నట్లు చెప్పారు. పీయూష్ నిరసన ఇప్పుడు వార్తాంశంగా మారటమే కాదు.. వైరల్ అయ్యింది. అలీగఢ్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు ఏ స్థాయిలో ఉందో దేశానికి తెలియజేస్తున్న పీయూష్ పుణ్యమా అని కిందామీదా పడుతున్నారు.

అదే సమయంలో అతగాడికి పంపిన చలానా పొరపాటు అని చెబితే.. అక్కడితే ఇష్యూ క్లోజ్ అవుతుంది. కానీ.. పోలీసులు మాత్రం ఆ విషయాన్ని తేల్చేందుకు మాత్రం వెనుకాడటం గమనార్హం. పీయూష్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఈ అంశంపై స్థానిక ట్రాఫిక్ ఎస్పీ స్పందించారు.

చలానా ఎలా జారీ అయ్యిందో డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉదంతం తెర మీదకు వచ్చి దాదాపు రెండు వారాలు అవుతోంది. ఈ ఇష్యూ మరింత పెరిగే వరకూ మురగబెట్టే కంటే.. తప్పు అయిపోయిందని తేల్చేస్తే సరిపోతుంది. కానీ.. పోలీసులు మాత్రం డేటా పరిశీలనలోనే రెండు వారాలు గడిపేశారు. డేటాలో జరిగే పొరపాట్లతో ఇలాంటి తప్పులు జరుగుతాయన్న సమర్థింపు కన్నా.. బాధితుడికి పంపిన చలానాను రద్దు చేస్తే సరిపోతుంది. కానీ.. అలాంటిదేమీ చేయకపోవటంతో అలీగఢ్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు ఎంత బాగుంటుందో  పీయూష్ తన విచిత్ర నిరసనతో చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.


Tags:    

Similar News