కాంగ్రెస్ కు పాత మిత్రుడు ఝ‌ల‌క్ ఇస్తున్నాడా!

Update: 2020-01-19 13:04 GMT
గ‌త ఏడాది లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత సానుకూల ఫ‌లితాలు వ‌చ్చిన రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు ఒక‌టి. అక్క‌డ కాంగ్రెస్ సొంతంగా ఏం సాధించ‌లేక‌పోయినా.. డీఎంకేతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లి ఎంతో కొంత ల‌బ్ధి పొందింది. మిగ‌తా దేశంతో పోలిస్తే త‌మిళ‌నాట కాంగ్రెస్ కు అలా సానుకూల ఫ‌లితాలు ద‌క్కినట్టే. అక్క‌డ కాంగ్రెస్ కు డీఎంకే రూపంలో ఒక గ‌ట్టి మిత్ర‌ప‌క్షం ఉండ‌టంతోనే ఆ విజ‌యం సాధ్యం అయ్యింది. చాలా కాలంగా.. ఈ రెండు పార్టీలూ మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగుతూ ఉన్నాయి.

2004లో యూపీఏలోకి డీఎంకే చేరిన‌ప్ప‌టి నుంచి ఈ రెండు పార్టీలూ స‌న్నిహితంగానే మెలుగుతున్నాయి. కొన్ని సార్లు ఎన్నిక‌ల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే ఆ త‌ర్వాత రాజీకి వ‌చ్చాయి. కానీ ఇప్పుడు స్టాలిన్ తీరు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతోంది.

ఇటీవ‌ల బీజేపీ నేత‌ల‌తో స‌న్నిహితంగా క‌నిపించాడు స్టాలిన్. ఇది కాంగ్రెస్ కు మింగుడుప‌డ‌టం లేదు. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వ‌హించిన సీఏఏ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల్లో కూడా డీఎంకే పాల్గొన‌లేదు. త‌మిళ‌నాట ఆ బిల్లు ప‌ట్ల వ్య‌తిరేక‌తే ఉంది. అయినా డీఎంకే కాంగ్రెస్ తో భుజం క‌ల‌ప‌లేదు. దీంతో స‌హ‌జంగానే అనుమానాలు రేగుతూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాట కాంగ్రెస్, డీఎంకే నాయ‌కుల మ‌ధ్య‌న దూరం పెరుగుతూ ఉంది. స్టాలిన్ పై సోనియాకు ఫిర్యాదు చేశార‌ట కాంగ్రెస్ నేత‌లు. అయితే ఆమె వారినే వారించిన‌ట్టుగా తెలుస్తోంది.

డీఎంకేతో స‌ర్దుకుపోవాల‌న్న‌ట్టుగా సోనియా సూచించింద‌ట‌. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒక పార్టీకి దూరం కావ‌డానికి సోనియా రెడీగా లేక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది నేత‌ల‌ను పంపించి సోనియా.. స్టాలిన్ తో శాంతి చర్చ‌లు జ‌రిపిస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలూ స‌ర్దుకుపోతాయ‌ని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో య‌థారీతిన త‌మ పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని వారు అంటున్నారు. ఈ ప‌రిణామాల గురించి ఎవ‌రూ మాట్లాడ‌
వ‌ద్ద‌ని స్టాలిన్ కూడా త‌న పార్టీ శ్రేణుల‌కు ఆదేశం జారీ చేశార‌ట‌.


Tags:    

Similar News