కవిత రీ ఎంట్రీ అప్పుడేనా..?
కేసీఆర్ రాజకీయ వారసత్వంతో కవిత రాజకీయాల్లో వచ్చారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
కేసీఆర్ రాజకీయ వారసత్వంతో కవిత రాజకీయాల్లో వచ్చారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. గెలిచిన తరువాత కూడా కేవలం ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగానూ గుర్తింపు సాధించారు. చాలా సందర్భాల్లోనూ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేశారు. అందుకే.. ఆమెకు రాష్ట్రవ్యాప్తంగానూ అభిమానులు ఉన్నారు.
కట్ చేస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సుమారు 5 నెలలకు పైగా ఆమె జైలులోనే ఉండిపోయారు. దాంతో కవిత ఎప్పుడు జైలు నుంచి విడుదల అవుతారా అని అభిమానులంతా ఎదురుచూశారు. ఇటీవల ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె వచ్చి కూడా 20 రోజుల పైనే అవుతోంది. కానీ.. ఇప్పటివరకు ఆమె ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. వచ్చీరాగానే కేసీఆర్‌ను కలుసుకున్న ఆమె.. కొన్ని రోజులపాటు అక్కడే ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఆమె అభిమానులంతా కవిత ఎప్పుడు ప్రజల్లోకి వస్తుందా అని చూస్తున్నారు.
అయితే.. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే పండుగ బతుకమ్మ. ఈ ఉత్సవాలు రాష్ట్రంలో మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఏటా కవిత తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ ఉత్సవాలను జరుపుతుంటారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా.. ఇతర దేశాల్లోనూ ఈ పండుగ వైభవాన్ని చాటుతుంటారు. ఈరోజు బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలకు చేరిందంటే అది కవిత క్రెడిట్ అనే అందరూ చెబుతూ ఉంటారు.
ఈ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్సీ కవిత చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వారం రోజులపాటు నిత్యం ఒక్క చోట బతుకమ్మలను స్వయంగా పేరుస్తూ వేడుకలు నిర్వహిస్తారు. నేటి తరానికి మన సంస్కృతిని చాటుతూ పండుగలా జరుపుతారు. అయితే.. పది రోజుల్లో ప్రారంభంక కానున్న బతుకమ్మ ఉత్సవాల్లో ఈసారి కవిత పాల్గొంటారా..? అనే సందిగ్ధం నెలకొంది. జైలు నుంచి వచ్చి ఆమె ఇంతవరకు బయటకు రాలేదు. ఒకవేళ బతుకమ్మ పండుగ వేళ వస్తే కాంగ్రెస్, బీజేపీల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందా..? అనే కోణంలోనూ ఆమె ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏటా ఘనంగా నిర్వహించి.. ఈ ఏడాది పండుగలో పాల్గొనకుంటే ప్రజల్లో నెగెటివ్ థింక్ వస్తుందనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆమె అనుచరులు మాత్రం కవిత బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతుందంటూ చెప్పుకొస్తున్నారు.