జమిలి ఖాయమేనా?... పార్టీలన్నీ సిద్ధమేనా?

Update: 2019-09-02 14:30 GMT
‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ దిశగా బీజేపీ నేత - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా స్టడీగానే వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే లోక్ సభలో స్పష్టమైన మెజారిటీ సాధించేసిన మోదీ... రాజ్యసభలోనూ బలం పెంచుకుని జమ్మూ కశ్మీర్ కు ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేశారు. దీనిపై పెద్ద  ఎత్తున విమర్శలు రేకెత్తినా... బీజేపీ జాతీయ అధ్యక్షుడు - తన కేబినెట్ లోని హోం మంత్రి అమిత్ షా తో కలిసి మోదీ చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసి నెట్టుకొచ్చారు. ఇక రాజ్యసభలో మరింత బలం పెంచేసుకుని - లోక్ సభలో మాదిరిగా రాజ్యసభలోనూ మెజారిటీ సాధించేసిన తర్వాత మోదీ జమిలి ఎన్నికల దిశగా కీలక నిర్ణయం తీసుకుంటారన్న విశ్లేషణలు ఇప్పుడు బాగానే వినిపిస్తున్నాయి. లోక్ సభలో వరుసగా రెండు సార్లు తిరుగులేని మెజారిటీ సాధించిన బీజేపీ... ఇకపైనా తనకు ఎదురు లేదన్న రీతిలో సాగుతోంది. తనకు సాటి రాగల ప్రత్యర్థి లేదన్న మాటను జనాల్లోకి బాగానే తీసుకుని వెళుతున్న కలమనాథులు.. జమిలి ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకున్నా పెద్దగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమే లేదన్న మాట వినిపిస్తోంది.

సరే... మెజారిటీ ఉన్న బీజేపీ - జమిలికి తహతహలాడుతున్న మోదీ... ఒకే దేశం- ఒకే ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే... మరి మిగిలిన పార్టీల సంగతేంటి? జమిలి ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేకున్నా... మోదీ - షాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2024 కంటే ముందుగానే జరుగుతాయి కదా. మరి మరో సార్వత్రిక ఎన్నికలకు అవకాశం లేకుండానే జమిలి ఎన్నికలు వచ్చేస్తే.... బీజేపీ కాకుండా దేశంలో మిగిలిన పార్టీలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయన్నది ఆసక్తికరమే. బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ భాగస్వాములు జమిలి ఎన్నికలను వ్యతిరేకించే అవకాశమే లేదు. ఎందుకంటే... జనాల్లో మంచి మైలేజీ సాధించిన బీజేపీ అండగా ఆ పార్టీలన్నీ జమిలి ఎన్నికలకు చాలా ఉత్సాహంగానే వెళతాయని చెప్పక తప్పదు.

అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీల పరిస్థితి ఏమిటి? ఈ రెండు కూటములకు దూరంగా ఉంటున్న మిగిలిన పార్టీల పరిస్థితి ఏమిటి? అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు. ఆ పార్టీతో జట్టుగా సాగుతున్న యూపీఏ పక్షాలు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకించడం సహజమే. మరి ఈ రెండు కూటములతో సంబంధం లేని పార్టీల పరిస్థితి ఏమిటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ ఎన్డీఏ - నాన్ యూపీఏ పార్టీల సంగతెలా ఉన్నా... తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఈ ఎన్నికలపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ - యూపీఏ కూటములకు దూరంగా ఉంటున్న వైసీపీ - టీఆర్ ఎస్ లే అధికారంలో ఉన్నాయి. జమిలి ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్తంత సానుకూలంగానే ఉన్నా... 2024 కంటే చాలా ముందుగానే జమిలి అంటే ససేమిరా అనే అవకాశాలే ఎక్కువ అన్న వాదన వినిపిస్తోంది. బీజేపీతో పాటు కాంగ్రెస్ తో సమదూరాన్నే పాటిస్తున్న కేసీఆర్... 2024కు కాస్త అటూ ఇటూగా జమిలి అయితే ఒప్పుకుంటారన్న వాదన వినిపిస్తోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే... ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ... బీజేపీతో ఓ మోస్తరు స్నేహాన్నే కొనసాగిస్తున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పదేళ్ల పాటు విపక్షంలోె ఉండి మొన్నటి ఎన్నికల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వైసీపీ... 2024 కంటే మరీ ముందుగా జమిలి అంటే ఒప్పుకోకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇక మొన్నటి ఎన్నికల్లో గట్టి దెబ్బే తిన్న టీడీపీ - జనసేనలు ఇప్పటికిప్పుడు జమిలి అన్నా వెంటనే ఒప్పేసుకునే అవకాశాలే ఎక్కువ అన్న వాదన వినిపిస్తోంది. అయినా మిగిలిన పార్టీలు సిద్ధమా? లేదా?... ఆ పార్టీలు అవునంటాయా? కాదంటాయా? అన్న విషయాన్ని మోదీ - షాలు అసలు పట్టించుకోరు కదా. ఫుల్ మెజారిొటీ ఉన్న బీజేపీకి ఓకే అయితే... ఆ పార్టీ ఎప్పుడంటే అప్పుడే జమిలి. ఇతర పార్టీల ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు కదా.


Tags:    

Similar News