విశాఖ బాధ్యతలన్నీ గంటాకే...?

Update: 2023-01-18 09:07 GMT
తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద ఇబ్బంది తప్పింది. దిగ్గజ నేత. అంగబలం అర్ధబలం సమృద్ధిగా ఉన్న గంటా శ్రీనివాసరావు తాను తెలుగుదేశం పార్టీలోనే అంటూ ఒక చక్కని శుభవార్త చెప్పారు. ఎన్టీయార్  వర్ధంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం ఒక అతి పెద్ద కుటుంబం అని చెప్పారు.

తమ కుటుంబంలో పెద్దలు అయిన చంద్రబాబు లోకేష్ బాబులను కలవడం  కూడా వార్తేనా అంటూ మీడియాకు ఎదురు ప్రశ్నించారు. తాను ఎపుడూ పార్టీ లైన్ దాటలేదని చెప్పుకున్నారు. అలాగే తాను తెలుగుదేశం వీడుతున్నట్లుగా చెప్పలేదని గుర్తు చేశారు. తాను పార్టీలోనే ఉంటున్నాను అని ఆయన చెప్పారు.

రెండేళ్ళ పాటు కరోనా వల్ల తాను పెద్దగా బయటకు రాలేకపోయానని,అలాగే తన అనారోగ్య సమస్యల వల్ల కూడా పార్టీకి కొంత టైం కేటాయించలేదని అన్నారు. ఇపుడు తాను ఫుల్ స్వింగ్ లో ఉన్నాను అని గంటా చెప్పేసుకున్నారు. తాను పార్టీలో ఫుల్ ఎనర్జీతో పనిచేస్తాను అని ఆయన అన్నారు.

ఈ విధంగా గంటా చెప్పడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. గంటా అంటే ఒక అక్టోపస్ లాంటి వారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఆయన తెలుగుదేశంతో ఉంటున్నాను అని చెప్పారు అంటే కచ్చితంగా 2024లో ఆ పార్టీ గెలిచి తీరుతుందనే విశ్వాసంతోనే అని అంటున్నారు.

గంటా అర్ధ బలం అంగబలం తెలిసిన తెలుగుదేశం అధినాయకత్వం కూడా ఆయన పార్టీకి కాకుండా పోతారేమో అని కంగారు పడింది. అప్పట్లో ఆయన వైసీపీలోకి వెళ్తారు అంటూ వచ్చిన వార్తల పట్ల కూడా కలవరపడింది. కానీ చివరకు గంటా తెలుగుదేశంతోనే తాను అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది.

ఈ మధ్యనే లోకేష్ బాబుని కలుసుకుని మనసు విప్పి అన్ని మాట్లాడిన గంటా ఇక మీదట పాత గంటాను చూపిస్తాను అని అంటున్నారు. ఆయన గతంలో విశాఖ జిల్లా రాజకీయాలను మొత్తం భుజాన మోశారు. ఒక సమయంలో ఉత్తరాంధ్రా దాకా కూడా తన చూపు సారించారు. ఈసారి ఎన్నికలు తెలుగుదేశానికి అత్యంత కీలకం కానున్న నేపధ్యంలో గంటాకు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధులకు అన్ని విధాలుగా అయన అండగా ఉండడమే కాకుండా తనదైన వ్యూహాలతో గెలిపించుకుని వస్తారన్న నమ్మకం కూడా పార్టీకి ఉంది. అదే సమయంలో తన అనుచరులకు కూడా టికెట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనలో గంటా ఉన్నారు. ఇలా ఉభయకుశలోపరిగా గంటా తెలుగుదేశం పెద్దల మధ్య సుహృద్భావ వాతవారణం నెలకొందని అంటున్నారు. దీంతో గంటా మరో మారు రాజకీయ జేగంటను మోగించడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న గంటా తన రాజకీయ వ్యూహాలను ఇక మీదట చకచకా అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులకు చెక్ పెడతారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News