ఆ నానీలందు ఆళ్ల నాని వేర‌యా!

Update: 2022-02-03 01:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు రాగానే.. ఆ ఇద్ద‌రు మంత్రులు వెంట‌నే రంగంలోకి దిగిపోతారు.. ప్ర‌తిప‌క్షాలు కౌంట‌ర్లు ఇస్తారు.. మాట‌ల దాడిని కొన‌సాగిస్తారు.. ఇదీ ఏపీ రాజ‌కీయాల్లో ఉన్న భావ‌న‌. ఇంత‌కు ఆ ఇద్దరు మంత్రులు ఎవ‌రంటే.. ఇద్ద‌రూ నానీలే. ఒక‌రు కొడాలి నాని కాగా మ‌రొక‌రు పేర్ని నాని. ఈ ఇద్ద‌రితో పాటు మ‌రో నాని కూడా వైసీపీ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయ‌న ఈ ఇద్ద‌రిలా కాదు.. సేప‌రేటు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి పేరు ఆళ్ల నాని. కొడాలి నాని, పేర్ని నానితో పోలిస్తే ఆళ్ల నాని సౌమ్యుడిగా క‌నిపిస్తున్నార‌నే టాక్ ఉంది.

ఏలూరు నుంచి ఆళ్ల నాని, గుడివాడ నుంచి కొడాలి నాని, మ‌చిలీప‌ట్నం నుంచి పేర్ని నాని గ‌త ఎన్నిక‌ల్లో గెలిచారు. వీళ్ల‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిస్తూ త‌న మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ‌ల‌ను అప్ప‌జెప్పారు. వీళ్ల‌లో ఆళ్ల నాని, పేర్ని నాని కాపు సామాజిక వ‌ర్గం కాగా..  కొడాలి నానిది క‌మ్మ సామాజిక‌వ‌ర్గం. ఇలా అన్ని ర‌కాలుగా లెక్క‌లేసి మ‌రీ జ‌గ‌న్ వీళ్ల‌ను త‌న కేబినేట్‌లోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో పేర్ని నాని, కొడాలి నాని ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. జ‌గ‌న్‌పైనా, ప్ర‌భుత్వంపైనా ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే వెంట‌నే విరుచుకుప‌డుతున్నారు. కానీ ఆళ్ల నాని మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటున్నార‌ని టాక్. కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఆయ‌న కాస్త సైలెంట్‌గా ఉంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స‌మ్మెలోకి వెళ్తామ‌ని ప్ర‌క‌టించిన ఆళ్ల నాని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేవ‌లం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్వ‌హించే స‌మీక్ష‌ల‌కు హాజ‌రు కావ‌డం త‌ప్ప మిగ‌తా అన్ని విష‌యాల‌కు ఆయ‌న దూరంగా ఉంటున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఏలూరులోనూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లోనూ త‌క్కువ‌గానే క‌నిపిస్తారు. ఆయన‌కు ప్ర‌చారం ఇష్టం లేక‌పోయినా క‌నీసం పార్టీ కోస‌మైనా ప్ర‌జ‌ల్లోకి రావాలి క‌దా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2014లో ఆళ్ల నాని ఓడిపోయినా ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. 2019లో మంత్రిని చేశారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ అంత‌గా ప్రాధాన్య‌త ఇస్తున్న‌ప్ప‌టికీ పార్టీ ప‌రంగా మాత్రం ఆళ్ల నాని పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా లేర‌ని విశ్లేష‌కులు అంటున్నారు. జిల్లాలో పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతున్నా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైన ఆయ‌న దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం లేద‌ని అంటున్నారు.
Tags:    

Similar News