ఆర్కే సంచలనం..లింగమనేనిదంతా అవినీతి దందానేనట!

Update: 2019-07-06 16:31 GMT
నవ్యాంధ్రలో వైసీపీ అధికారం చేపట్టాక, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి దందాలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అమరావతి తీరాన కృష్ణా నది కరకట్టపై అక్రమంగా వెలసిన కట్టడాల అంతు చూసే దిశగా ప్రజావేదికను కూల్చివేసిన వైసీపీ సర్కారు... ఆ తర్వాత కరకట్టపై వెలసిన అన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ప్రస్తుతం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా జారీ అయ్యింది. ఈ భవన యజమాని హోదాలో నోటీసులు అందుకున్న లింగమనేని రమేశ్... నోటీసులకు కౌంటర్ గా తన భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే లింగమనేని వాదనలోని డొల్లతనాన్ని, ఆయన సాగించిన అవినీతి దందాను, ఆ దందాకు చంద్రబాబు ఎలా అండగా నిలిచారన్న విషయాన్ని వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా వివరంగానే బట్టబయలు చేశారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆర్కే... లింగమనేని సాగించిన చీకటి దందాను కళ్లకు కట్టేలా వివరించారు. తన నియోజకవర్గంలో చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన లింగమనేని... వాటిలో విల్లాలు కట్టేసి ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. వ్యాపారం బాగానే సాగినా... తాను కట్టిన విల్లాలకు లింగమనేని అసలు అనుమతులే తీసుకోలేదని కూడా ఆర్కే ఆరోపించారు. ఈ దందాకు సంబంధించి ఖాజా పంచాయతీకి లింగమనేని రూ.50 కోట్ల మేర బకాయి పడ్డారని ఆర్కే సంచలన ఆరోపణ చేశారు. పంచాయతీ నుంచి నోటీసులు అందినా... స్పందించకుండా, వాటితో తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లింగమనేని చాలా కుటిల యత్నాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ కుటిల యత్నాలకు లింగమనేనికి చంద్రబాబు బాగానే సహకరించారని కూడా ఆర్కే మరో సంచలన ఆరోపణ చేశారు. తన నివాసం కోసం కృష్ణా కరకట్టపై అత్యంత విలాసంగా నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ను లింగమనేని ఇవ్వడంతో... అందుకు ప్రతిఫలంగా లింగమనేనిపై చంద్రబాబు ఈగ వాలకుండా చేశారని ఆర్కే ఆరోపించారు. మొత్తంగా లింగమనేని సంపాదించిన ఆస్తి మొత్తం అక్రమంగా, చీకటి దందాలతో సాగించినదేనని తేల్చేసిన ఆర్కే... అందులో చంద్రబాబుకు కూడా పాత్ర ఉందని ఆరోపణలు చేసి నిజంగానే సంచలనం రేపారు. మరి ఆర్కే ఆరోపణలపై ఇటు లింగమనేని గానీ, చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.


Tags:    

Similar News