న్యూయార్క్ గవర్నర్‌ పై లైంగిక ఆరోపణలు !

Update: 2020-12-14 10:38 GMT
లైంగిక ఆరోపణలు .. ఈ మధ్య కాలంలో వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లో ఈ తరహా ఆరోపణలపై కొదవే ఉండదు. అక్కడ రోజుకో నేత పై లైంగిక ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఎన్నికల ముందు ట్రంప్ పై కూడా లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అమీ డోరిస్ అనే మ‌హిళ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ట్రంప్ పై ఈ తరహా ఆరోపణలు రావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే , ఎన్నికల సమయంలో ట్రంప్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ట్రంప్ మద్దతు దారులు దాన్ని తోసిపుచ్చారు. అలాగే , గ‌తంలో బిల్ ‌క్లింట‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న‌పై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో కొన్ని నెల‌ల పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా బిల్‌ క్లింట‌న్‌పై లైంగిక ఆరోప‌ణ‌లపై చర్చలు జరిగాయి.

ఇదిలా ఉంటే ..తాజాగా అమెరికా లో మరో కీలక నేత పై లైంగిక ఆరోపణలు వచ్చాయి, న్యూయార్క్ గవర్నర్ పై ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేసింది. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా రాజకీయ నాయకురాలు ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లపాటు ఆండ్రూ క్యూమో తనను లైగింకంగా వేధించారని లిండ్సే బోయ్లాన్ పేర్కొన్నారు. ‘ఆండ్రూ క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఆయన నన్ను లైగింకంగా వేధించాడు. ఆయన నన్ను వేధించడాన్ని చాలా మంది చూశారు. ప్రపంచలో చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసు. క్యూమో వంటి కొంత మంది పురుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేను ద్వేషిస్తున్నాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. క్యూమో అడ్మినిస్ట్రేషన్‌ లో లిండ్సే బోయ్లాన్.. 2015 నుంచి 2018 వరకు పని చేశారు. అయితే ఈ ఆరోపణలపై క్యూమో ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. అయన స్పందించకపోవడం తో ఆ ఆరోపణలు నిజమేనేమో అన్న భావనలో కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం మహిళా నాయకురాలి లైంగిక ఆరోపణలు అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Tags:    

Similar News