గోదావరి పుష్కరాలపై ఇదేం గోల

Update: 2015-06-28 10:36 GMT
జూలై 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలు వివాదంలో చిక్కుకున్నాయి. అదేంటి పుష్కరాలు వివాదంలో పడటం ఏంటని అనుకోకండి. జోతిష్య రీత్యా నిపుణులు అయినవాళ్లే గ్రహాలు, నక్షత్రాలు, తిథులు చూసుకొని గోదావరి పుష్కరాల తేదీలను ఖరారు చేశారు. అయితే రాజమండ్రికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

సూర్య సిద్ధాంతం ప్రకారం జూన్ 28 నుంచే గురుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఈ రోజు నుంచి జూలై 9వ తేదీ వరకూ పుష్కరాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇంతటితో ఊరుకోకుండా...తన కుటుంబంతో పాటు కొందరిని వెంటబెట్టుకొని రాజమండ్రి గోదావరిలో స్నానమాచరించారు. మరోవైపు ఆయన కుమారుడు సైతం పుష్కరాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. పుష్కర ముహూర్తానికి సంబంధించి తన వాదనని ఎవరితోనైనా నిరూపించడానికి సిద్ధమని కృష్ణమూర్తి శాస్త్రి, ఆయన కుమారుడు సవాల్ విసిరారు.

గోదావరిలో పలుచోట్ల పుష్కరాలకు సరిపడా నీళ్లులేవని ఒకవైపు.... పనులు ఇంకా పూర్తికాలేదని మరోవైపు ప్రభుత్వాలు సతమతం అవుతుంటే కృష్ణమూర్తి శాస్త్రి మరో కొత్త అంశం తెరమీదకు తీసుకువచ్చారు. కృష్ణమూర్తి శాస్త్రి చెప్పిన మేరకు పాలకులు తలపండిన పండితులు, ఇతరులతో శాస్త్రి గారితో చర్చింపచేసి స్పష్టత ఇస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News