మైనార్టీ శాఖను మింగేసిన పౌరసరఫరాలు

Update: 2015-07-18 04:06 GMT
    ఏపీ మంత్రుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. 'చంద్రన్న రంజాన్ తోఫా' అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, మైనారిటీ, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మధ్య చిచ్చు పెట్టింది. చంద్రన్న రంజాన్ తోఫా కిట్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలపై మైనారిటీశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఫొటో ముద్రించకపోవడంతో వివాదం ప్రారంభమైంది. దీన్ని తీవ్రంగా తీసుకున్న మంత్రి పల్లె ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

రంజాన్ సందర్భంగా తెల్ల కార్డు ఉన్న ముస్లింలకు ఉచితంగా చందన్న రంజాన్ తోఫా పేరిట ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి ఉచితంగా అందజేస్తున్నారు. వీటన్నంటిని ఒక సంచిలో పెట్టి మైనారిటీలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రంజాన్ తోఫాపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు ముస్లింల ఆదరణ చూరగొనాలని యత్నించింది. అయితే రంజాన్ తోఫా సంచిపై మైనారిటీ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఫోటో మాయమైంది. రంజాన్ తోఫా ప్రచార కార్యక్రమాలు, కిట్ల సంచులు, గోడ పత్రికలు, ప్రచార ఫ్లెక్సీలు, ఆఖరుకు కార్యక్రమం ప్రారంభానికి కూడా సంబంధితశాఖ మంత్రి లేకుండానే కానిచ్చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తమ శాఖకు చెందిన కార్యక్రమం అంటూ పౌరసరఫరాలశాఖ దూకుడుగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి ఫొటోతో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫొటోలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వీటిలో ఎక్కడా మైనారిటీశాఖ మంత్రి పల్లె ఫొటో లేకపోవడం గమనార్హం. దీనిపై మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కినుక వహించి పౌరసరఫరాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయన జోక్యం చేసుకుని పౌరసరఫరాల అధికారులపై మండిపడ్డారు. దీంతో వెంటనే ఫ్లెక్సీలపై మైనారిటీశాఖ మంత్రి పల్లె ఫొటో అతికించారు. మైనారిటీశాఖ మంత్రి సందేశంతో కూడిన కరపత్రాన్ని ముద్రించి రంజాన్ తోఫాతో పాటు పంపిణీ చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాత్రికిరాత్రికి కరపత్రాలు ముద్రించి డీలర్లకు సరఫరా చేశారు. మొత్తానికి తోఫా సాక్షిగా ఇద్దరు అమాత్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
Tags:    

Similar News