పుష్కర ముహుర్తంలోనూ ఎవరి దారి వారిదే

Update: 2015-07-07 09:58 GMT
మరో వారం రోజుల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై ఇప్పటికే పలు వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మిగిలిన విషయాల మాదిరే గోదావరి పుష్కరాల ముహుర్తం విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తేడా ఉంది.

ఒకే ప్రాంతానికి చెందినప్పటికీ.. ముహుర్తం విషయంలో ఎవరి ముహుర్తం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన ముహుర్తాలు చూస్తే.. ఈ నెల 14న ఉదయం 6.26గంటలకు ఏపీ పుష్కరాలు ప్రారంభం అవుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు మాత్రం అదే రోజు పది నిమిషాలు ఆలస్యంగా ఉదయం 6.36 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఇక.. ఏపీలో పుష్కరాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో స్టార్ట్‌ చేస్తే.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వం ధర్మపురిలో షురూ కానున్నాయి. జూలై 14 నుంచి స్టార్ట్‌ అయ్యే పుష్కరాలు జూలై 25 వరకు కొనసాగుతాయి.

ఇక.. ప్రభుత్వాల మధ్యన పుష్కరాల ముహుర్తంలో తేడాలు ఉన్నట్లే పండితుల విషయంలోనూ ఇలాంటి తేడాలు కనిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాలు జూలై 14న కాదు.. ఇప్పటికే ప్రారంభం అయిపోయాయని.. జూన్‌ 28న మధుర కృష్ణమూర్తి అనే సిద్ధాంతి చెప్పటం తెలిసిందే. ఇక.. శ్రీశైల దేవస్థాన్‌ అస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్ర శర్మ మాత్రం పుష్కరాలు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయంటూ.. నేటి ఉదయం ఆయన గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు.

ఇదిలా ఉంటే.. ఎవరి నమ్మకం వారిదన్నట్లుగా.. ఏ సిద్ధాంతి మీద నమ్మకం ఉన్న వారు ఆ సిద్ధాంతి చెప్పినట్లుగా పుష్కర స్నానాలు ఆచరించటం గమనార్హం. ఈ రోజు ఉదయం గోదావరిలో వేలాదిమంది పుష్కర స్నానాలు చేయటమే దీనికి నిదర్శనం. ఇంత పెద్ద ప్రభుత్వాలు ఉండి.. ఇన్ని వ్యవస్థలు అందుబాటులో వచ్చిన తర్వాత.. పండితుల్ని ఒక దగ్గరకు చేర్చి.. ఏకాభిప్రాయం వచ్చేలా ప్రభుత్వాలు ఎందుకు చేయవు? ఇలాంటి వాటి విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు స్పందించదో..?

Tags:    

Similar News