పవన్‌ కు దగ్గరయ్యేందుకు అల్లు ప్రయత్నిస్తున్నారా?

Update: 2018-04-19 14:49 GMT
పవన్ కల్యాణ్‌కు అల్లు అరవింద్ ఫ్యామిలీకి దూరం పెరిగిందని ఫిలింనగర్‌లో వినిపిస్తుంటుంది. ముఖ్యంగా పవన్, బన్నీల మధ్య విభేదాలున్నట్లు చెప్తారు. అరవింద్‌పైనా పవన్‌కు ఆగ్రహం ఉందంటుంటారు. సత్సంబంధాలు లేవనీ వినిపిస్తుంటుంది. కానీ.. ఇప్పుడు పవన్ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఎలాగైనా ఆయనతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్ అడగకున్నా మీడియా ముందుకొచ్చి అల్లు అరవింద్ పవన్ పక్షం వహించారంటున్నారు.
    
పవన్‌ కల్యాణ్‌పైకి శ్రీరెడ్డిని ఉసిగొల్పింది ‌తానేనని రాంగోపాల్ వర్మ చెప్పడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.  వర్మ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ నిప్పులు చెరిగారు. రాంగోపాల్ వర్మను నికృష్ఠుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
    
శ్రీరెడ్డి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత సురేశ్ బాబు కుటుంబంతో తాను మాట్లాడానని.. తాము ఎవరికీ డబ్బులిచ్చి సెటిల్ చేసుకోవాలని ప్రయత్నించలేదని వారు చెప్పారని అల్లు అరవింద్ అన్నారు. మెగా ఫ్యామిలీ అంటే వర్మకు అస్సలు పడదని... అందుకే శ్రీరెడ్డి ద్వారా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించారన్నారు.  సురేష్‌ బాబు ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి ఐదు కోట్లు ఇప్పించేందుకు ప్రయత్నించానని వర్మ చెప్పడంతో వెంటనే తాను సురేష్‌ బాబుకు ఫోన్‌ చేశానన్నారు. సురేష్ బాబు మాత్రం తాము ఎవరికీ భయపడమని.. నేరుగా ఎదుర్కొంటామని అన్నారని అల్లు అరవింద్ తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినట్లు ఇలాటే అల్లరి చేసే ప్రయత్నాలు జరిగాయని.. ఇప్పుడు పవన్ జనసేన ప్రజల్లోకి వెళ్తున్నందున ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్ ఇక జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు.
    
శ్రీరెడ్డిపై పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేస్తే దాన్ని చూపించి పవన్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని వర్మ ప్రయత్నించారని అల్లు అరవింద్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో శ్రీరెడ్డి వెనక వర్మ ఉన్నాడని…. వర్మ వెనక ఇండస్ట్రీలోనే ఎవరో ఉన్నారన్నట్లుగా అరవింద్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
    
ఇదంతా ఒకెత్తయితే పవన్ విషయంలో పెద్దగా ఏమీ మాట్లాడని అల్లు అరవింద్ ఇప్పుడు తనకుతానే ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో పార్టీ వ్యవహారాలన్నీ చూస్తూ బిజీ అయిన ఆయన ఇప్పుడు జనసేనలోనూ కీలకంగా ఉండాలని ఆశపడుతున్నారని.. అందుకే పవన్ కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది.


Tags:    

Similar News