కాంగ్రెస్ లోకి అల్లు అర్జున్ మామ..?

Update: 2018-09-11 06:09 GMT
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కి టీఆర్ ఎస్ షాకిచ్చింది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ముందస్తు ఎన్నికలకు వెళుతూ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ జాబితాలో అల్లు అర్జున్ మామ పేరు గల్లంతైంది. ఆయనకు టీఆర్ ఎస్ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన కలత చెంది కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి..

గడిచిన 2014 ఎన్నికల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ శివారులోని ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.  అనంతరం పరిణామాల్లో మంచిరెడ్డి టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిపోయారు.  ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం ఈ ఎన్నికల్లో నియోజకవర్గ టీఆర్ ఎస్ ఇన్ చార్జిగా ఉన్న అల్లు అర్జున్ మామకు టిక్కెట్ నిరాకరిస్తూ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డికే టిక్కెట్ ఖరారు చేసింది..

అనాదిగా టీఆర్ ఎస్ లో ఉంటూ పార్టీ కోసం సేవ చేస్తున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం.. టీడీపీ నుంచి చేరిన మంచిరెడ్డికి టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి మనస్తాపం చెందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇబ్రహీం పట్నం కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. తాను కాంగ్రెస్ లో చేరుతానని చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గడిచిన ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మామ చంద్రశేఖర్ రెడ్డి తరఫున ప్రచారం చేయలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ టికెట్ వస్తే ప్రచారం చేయాలని భావించారట.. కానీ టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నిరుత్సాహ పడ్డట్టు వార్తలొస్తున్నాయి.

అల్లు అర్జున్ ఇప్పటివరకూ ఒకేసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదీ 2009లో తన మామ చిరంజీవి కోసం.. పాలకొల్లులో చిరంజీవి గెలుపు కోసం రాంచరణ్ తో కలిసి అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు.  కానీ ఆ ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం ఫలించదు. పాలకొల్లులో చిరు ఓడిపోయారు. ఇప్పుడు మామ కోసం చేద్దామనుకున్నా టికెట్ దక్కలేదు.
Tags:    

Similar News