గోల్డ్ మ్యాన్.. పేరుకు తగ్గట్లే మూతికి మాస్కు బంగారమే

Update: 2020-07-17 17:30 GMT
కొందరికి కొన్నింటి మీద ఉండే మమకారం అంతా ఇంతా కాదు. ఒంటిమీద బంగారు నగలతో తిరిగే మగాళ్లకు కొదవలేదు. చాలా చోట్ల ఇలాంటోళ్లు కనిపిస్తారు. బంగారం మీద తమకున్న ఆసక్తిని దాచుకోకుండా ఓపెన్ గా చూపించేయటం వారికి అలవాటు. ఆ కోవలోకే వస్తారు ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని కేశర్ పూర్ ప్రాంతానికి చెందిన ఫర్నీచర్ వ్యాపారి అలోక్ మహంతి. ఆయనకు బంగారమంటే చాలా ఇష్టం. చేతికున్న ప్రతి వేలుకు పాత అర్థరూపాయి బిళ్ల సైజులో ఉన్న రాళ్ల ఉంగరాల్ని పెడుతుంటారు.

ఒక చేతికి బంగారు వాచ్.. మరోచేతికి బారడంత బ్రేస్ లెట్ ధరిస్తారు. ఇక్కడితో కాలేదు. మెడలో భారీ ఎత్తున బంగారు గొలుసుల్ని ధరిస్తారు. ఇలా చూసినంతనే గోల్డ్ మ్యాన్ అన్న మాటకు నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. ఒంటి మీద తక్కువలో తక్కువ కేజీకి పైనే బంగారాన్ని ధరించిన ఆయన్ను చూస్తే..కదిలి వచ్చే గోల్డ్ షాపులా ఉంటారు. కరోనా నేపథ్యంలో అందరిలా మాస్కు పెట్టుకోవాల్సి రావటంతో ఈ పెద్ద మనిషి.. ముఖానికి బంగారపు మాస్కును తయారు చేయించాడు.

ముప్ఫై గ్రాముల బరువుతో బంగారు మాస్కు చేయించుకున్న అలోక్.. దాన్ని పెట్టుకొని ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాడు. ముంబయిలోని జావేరీ బజారులోని ఈ బంగారు మాస్కును తయారు చేయించుకున్నాడట. ఈ మాస్కు తయారు చేసేందుకు మూడు వారాల సమయం పట్టిందని చెబుతున్నారు. బంగారం మీద మోజు ఉండొచ్చు కానీ తయారు చేయించిన మాస్కుసైతం శాస్త్రీయంగా ఉండేలా.. ఎన్ 95 మాస్కు ప్రమాణాలకు తగ్గట్లే తయారు చేయించాడట.

బంగారం మీద విపరీతమైన మోజు ఉన్న అలోక్ లో మరో కోణం కూడా ఉంది. కరోనా వేళలో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అపన్నులకు సాయం చేస్తుండటం ఇతనికో అలవాటు. రోడ్ల మీద వెళ్లే వారికి మజ్జిగ పాకెట్లు.. అవసరమైన వారికి కిరాణా సామాన్లతో పాటు.. వీధుల్లో సంచరించే పశువులకు దాణాను ఏర్పాటు చేయటం అతనికో అలవాటుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ గోల్డ్ మ్యాన్ అసలుసిసలు ‘బంగారం’ లాంటి మనిషిగా పలువురు అభివర్ణిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News