అల్లాడిపోతున్న షాంఘైవాసులు

Update: 2022-04-11 23:30 GMT
కోవిడ్ మహమ్మారిని అడ్డుకోవటమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది. కాకపోతే ఆంక్షలే మరీ ఎక్కువైపోవటంతో జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా కేసుల సంఖ్యను జీరోగా తీసుకురావాలని డ్రాగన్ ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది. అందుకనే యావత్తు షాంఘై నగరాన్ని లాక్ డౌన్ లో పెట్టేసింది. ఎప్పుడైతే లాక్ డౌన్ అమల్లోకి వచ్చిందో వెంటనే నగరం మొత్తం మిలిటరీ, పోలీసుల పరిధిలోకి వెళ్ళిపోయింది.

ఆంక్షలు ఏ స్ధాయిలో అమల్లో ఉన్నాయంటే సాధారణ జనాలెవరు కనీసం ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇళ్ళలోని వాళ్ళు తలుపులు తీసుకుని బయటకు రాకుండా బయట తలుపులను ప్రభుత్వం సీజ్ చేసేసింది. కనీసం కిటికీలు కూడా తెరవకూడదనే ఆంక్షలను విధించింది. అయినా సరే మొదటి అంతస్తుల్లోని వారు అపార్టుమెంట్లలో ఉంటున్న జనాలు బాల్కనీల్లోకి వచ్చి, కిటికీలు తెరిచి తమ బాధలను వ్యక్తంచేస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా తమకు తినటానికి కడుపునిండా తిండి కూడా దొరకడం లేదని, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు కూడా అందటం లేదని జనాలు గగ్గోలు పెట్టేస్తున్నారు. బాల్కనీల్లోకి వచ్చి జనాలు గావుకేకలు పెడుతున్నారు.

ఇలాంటి వాళ్ళ కేకలను, గోలను ఎదురింటిలో, అపార్టుమెంట్లలో ఉన్న వారు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రతిరోజు ఎక్కువైపోతుండటంతో ప్రభుత్వం సీరియస్ అయిపోతోంది.

జనాలను బయటకు రానీయండా, రోడ్లపై తిరగనీయకుండా ప్రభుత్వం రోబో కుక్కలను కాపలాగ ఉంచటమే అసలైన విచిత్రం. అంటే పోలీసులు, మిలిటరీకి అదనంగా ప్రభుత్వం రోబో కుక్కలను ఉపయోగిస్తున్నది. లాక్ డౌన్ కారణంగా తమకు కనీస అవసరాలు కూడా అందకపోవటంతో ఆకలిచావులు తప్పదని జనాలు నానా రచ్చ చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలను కఠినంగా అమలు చేస్తున్నా గడచిన 24 గంటల్లో సుమారు 25 వేల కేసులు నమోదవ్వటం. షాంఘైలోని తాజా పరిస్ధితులను చూసిన తర్వాత ఆంక్షలను  డ్రాగన్ ప్రభుత్వ ఎంత కఠినంగా అమలు చేస్తుందో తెలిసొస్తోంది.
Tags:    

Similar News