ఈ కాపు నేత రూటెటు?

Update: 2022-12-27 10:31 GMT
సీనియర్‌ రాజకీయ నాయకుడు, ఫైర్‌బ్రాండ్‌  కాపు నేత ఆమంచి కృష్ణమోహన్‌ ప్రస్తుతం డైలమాలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో చీరాల నుంచి 2009, 2014ల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రంగ ప్రవేశం చేసిన ఆమంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నవోదయం అనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిపై పోటీ చేసి గెలిచారు. 2015లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే, 2019 ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన గెలవలేకపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆమంచి కృఫ్ణమోహన్‌ ఇప్పుడు అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉన్న ఆయన తనకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలను అన్వేషిస్తున్నారు.

టీడీపీ టిక్కెట్‌పై గెలిచి అధికార వైఎస్సార్‌సీపీలో కరణం బలరాం చేరిన తర్వాత ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ, చేనేత సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతతోనూ ఆమంచికి అభిప్రాయ భేదాలున్నాయని టాక్‌.

ఈ నేపథ్యంలో తన ఇద్దరు బద్ధ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండడంతో పొరుగున ఉన్న పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జిగా పనిచేయాల్సిందిగా ఆమంచిని వైఎస్సార్‌సీపీ నాయకత్వం కోరింది. అయితే గత 15 ఏళ్లుగా చీరాల నుంచే రాజకీయం చేస్తున్న ఆమంచికి పర్చూరు ఇబ్బందేనని అంటున్నారు. అందులోనూ పర్చూరులో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి అక్కడ ఇమడలేననే భావనలో ఉన్నారని చెబుతున్నారు.

చీరాలలో వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ దక్కే అవకాశాలు మసకబారుతుండడంతో ఆమంచి కృష్ణమోహన్‌ ఇప్పుడు జనసేనలో చేరి చీరాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జనసేన అవకాశమివ్వకపోతే చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందనే టాక్‌ నడుస్తోంది. ఈ విషయంపై ఆమంచి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. కానీ, ఒక్కటి మాత్రం ఖాయమని.. వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జిగా పర్చూరుకు మాత్రం వెళ్లబోరని అంఒటున్నారు.
   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News