ఎక్స్ క్లూసివ్ : వైసీపీ లోకి చీరాల ఎమ్మెల్యే!

Update: 2019-02-04 14:47 GMT
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ... అత్యంత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో అధికార టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. క‌డ‌ప జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి మొన్న టీడీపీకి గ‌ట్టి షాకిస్తూ వైసీపీలో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ ను ఆయ‌న సొంత జిల్లాలోనే దెబ్బ కొట్టేద్దామ‌ని భావిస్తూ వ‌చ్చిన టీడీపీకి ఈ ప‌రిణామం పెద్ద షాకింగేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఆ త‌రహాలోనే ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలోనూ మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంటోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఘ‌న విజ‌యం సాధించారు.

అయితే ఆ త‌ర్వాత ఆయ‌నను ఎలాగోలా మేనేజ్ చేసిన టీడీపీ త‌న‌లో చేర్చేసుకుంది. ఈ వ్య‌వ‌హారంలో రోజుల త‌ర‌బ‌డి పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వ‌యంగా రంగంలోకి దిగితే గానీ.. ఆమంచి దారికి రాలేదన్న వార్త‌లూ నాడు వినిపించాయి. ప్ర‌జ‌ల్లో మంచి ప‌లుకుబ‌డి క‌లిగిన ఆమంచికి నియోజ‌క‌వ‌ర్గం పై మంచి ప‌ట్టుంద‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నికల్లోనూ ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున అయినా గెలిచే ఛాన్సే అధికం. ఈ క్ర‌మంలో టీడీపీ ప‌ట్ల ఆమంచిలో పెరుగుతున్న అసంతృప్తిని గ‌మ‌నించిన వైసీపీ ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపి... స‌త్ప‌లితాన్ని సాధించిన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఆమంచి వైసీపీలోకి చేరిపోయే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారాన్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా... చాలా పక‌డ్బందీగా - చాలా ప్లాన్డ్‌ గా ముగించ‌డంలో వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి చాలా నేర్పుగా చ‌క్క‌బెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ లేని లోటును తీర్చేసిన చందంగా సాయిరెడ్డి త‌న‌దైన మంత్రాంగం నెరిపార‌ట‌.

వైసీపీ కేంద్ర కార్యాల‌యం లోట‌స్ పాండ్ వర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు... ఆమంచిలో టీడీపీ ప‌ట్ల పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ - వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న భేటీ అవుతార‌న్న స‌మాచారం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు... త‌న‌దైన మంత్రాంగం నెర‌పిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదో తాయిలాలు - మ‌రేదో అభివృద్ధి చెబుతూ చంద్ర‌బాబు... ఆమంచిని చాలా రోజుల నుంచే ఆపుతూ వ‌చ్చార‌ట‌. అయితే ఆమంచి ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేద‌ట‌. మొత్తంగా అటు చంద్ర‌బాబు బుజ్జ‌గింపులు, ఇటు సాయిరెడ్డి మంత్రాంగంతో ఫైన‌ల్ గా వైసీపీ వైపే మొగ్గిన ఆమంచి టీడీపీకి ఝ‌ల‌క్కిచ్చేందుకే నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మ‌రో రెండు రోజుల్లోనే ఆమంచి వైసీపీలోకి చేరిపోయే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News