పనిచేయని 'చంద్రబాబు భరోసా'.. టీడీపీకి గుడ్‌ బై చెప్పిన ఎమ్మెల్యే

Update: 2019-02-13 05:31 GMT
దిల్లీలో పెద్ద ఎత్తున హడావుడి చేస్తూ చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన రెండో రోజుకే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పార్టీని వీడడం సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో హీరోనైపోయానని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్న వేళ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో చంద్రబాబుపై పార్టీ నేతలకు నమ్మకం సడలుతోందన్న సంకేతాలు బలంగా వెళ్తున్నాయి.    
   
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పంపారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం తన అనుచరులు - కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించానని అన్నారు. నేడు వైసీపీ అధినేత జగన్ తో సమావేశం కానున్నానని అన్నారు.
   
కొద్దిరోజుల కిందట ఆమంచిని బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమంచిని కలిసిన ప్రకాశం జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు - పార్టీని వీడవద్దని నచ్చజెప్పి - ఆపై సీఎం వద్దకు తీసుకెళ్లారు. మారిన చీరాల రాజకీయ పరిస్థితుల్లో ఆమంచికి మరో మంచి అవకాశం ఇస్తామని చంద్రబాబు సర్దిచెప్పినా ఆయన వినలేదు. 2014 ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేసిన ఆమంచి అనూహ్య రీతిలో విజయం సాధించి, ఆపై తెలుగుదేశం పార్టీలో చేరారు.

Tags:    

Similar News