మన కులపోళ్లకి పిరికితనం ఉండదు పవన్ - ఆమంచి

Update: 2019-09-16 16:47 GMT
మాజీ ఎమ్మెల్యే - తెలుగుదేశం పార్టీకి ఇటీవలే గుడ్ బై కొట్టిన తోట త్రిమూర్తులు వైపీపీలో చేరిన సంగతి తెలిసిందే. రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ చేరికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం లేపుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి భయపడే కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారని పవన్ ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తోట త్రిమూర్తులు రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడి ఎవరూ వైసీపీలో చేరడం లేదని - ఆయన పాలనను చూసి మాత్రమే వైసీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.  కాగా తాజాగా ఇదే అంశంపై మరో కాపు నేత ఆమంచి కృష్ణ మోహన్ కాస్త ఘాటుగానే స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడే కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారని చెప్పి పవన్.. తనను తాను అవమానించుకున్నారని పేర్కొన్నారు. తాను కూడా ఓ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి - పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. దేన్నైనా ఎదురొడ్డి పోరాడడం మా కాపు కులం నైజమని - అలాంటి  కాపులం ఎలా భయపడతామని ప్రశ్నించారు. తోట త్రిమూర్తులు అలా భయపడేవారు కాదని ఆమంచి కృష్ణ మోహన్ తెలిపారు. ''మాలో ఉండే లక్షణాలే పవన్ కళ్యాణ్‌ లో కూడా ఉన్నాయనుకుంటున్నాం. పిరికితనంతో పార్టీ మారామని ఆయన అంటున్నాడంటే.. పవన్ కళ్యాన్ కూడా పిరికివాడే కదా'' అని లాజిక్ మాట్లాడారు ఆమంచి.

అయితే పవన్ పై ఆమంచి చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నమైన స్పందన వస్తోంది. ఎక్కడైనా కులాన్ని బట్టి లక్షణాలు ఉండటమేంటి? ఇదెక్కడి విడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్నారు జనసైనికులు. పవన్ వ్యక్తి గురించి మాట్లాడితే ఆమంచి కులం పేరు లాగటం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈ లెక్కన చూస్తే పవన్‌ పై కుల ముద్ర వేసి చిక్కుల్లో పెట్టాలని ఆమంచి ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోందని ఇంకొందరు వాదిస్తున్నారు
Tags:    

Similar News