విద్యావతిగా అమ‌రావ‌తి

Update: 2015-10-10 09:11 GMT
ఏపీ రాజధాని అమరావతి ఎడ్యుకేషన్ సిటీ కాబోతోంది.. ప్రజా రాజధాని అమరావతిలో ప్రపంచ శ్రేణి విశ్వ విద్యాలయా లను, విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ - సైబరాబాద్‌లలో ఉన్న జాతీయ స్థాయి విద్యా సంస్థలకు - విశ్వ విద్యాలయాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య ను అందించేందుకు అవసరమైన విద్యా సంస్థలను దశలవారీగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఇప్పటికే సింగపూర్‌ ప్రభుత్వానికి వివరాలను పంపించినట్లు తెలుస్తోంది.

అమరావతికి నలుదిక్కుల ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యార్థులతో పాటు దేశంలోని వివిద రాష్ట్రా లను విద్యార్థులను అమితంగా ఆకర్షించేందుకు వీలై న కోర్సులను ఈ విద్యా సంస్థల్లో ప్రారంభించాలని కూడా చంద్రబాబు సంకల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగు ప్రైవేట్‌ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు సంబందించిన బిల్లును తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నందున రాజధాని అమరావతిలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించే విశ్వ విద్యాలయాలను, విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అమరావతిలో ఇంధన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం ఇప్పటికే ఆమోదం పొందింది. కేంద్ర ఇంధన శాఖ దీనికి నిధులు ఇస్తానని చెప్పింది.     నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), విదేశీ భాషలకు సంబందించి హైదరాబాద్‌ లోని ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆవరణలో ఉన్న ఇండియన్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (ఇఫ్లూ) విశ్వ విద్యాలయం - ఫోరెన్సిక్‌ విశ్వ విద్యాలయం - ఆర్కిటెక్చర్‌ విశ్వ విద్యాలయం - గెమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వ విద్యాలయం - మానవ వనరుల విశ్వ విద్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.

రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టి తద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చైనా - జపాన్‌ - మలేషియా - సింగపూర్‌ - తైవాన్‌ - గ్రీస్‌ దేశాల నుంచి పేరొందిన పారిశ్రామిక వేత్తలు, సంస్థలు వస్తున్నందున ఈ దేశ భాషల్లో స్థానికులు పట్టుసాదించే విధంగా ఈ తరహా కోర్సులను ప్రపంచ స్థాయి విశ్వ విద్యాలయాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని నాగార్జున - ఆంధ్ర - శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో జపనీస్‌ విభాగాలను ఇప్పటికే ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యార్థులకు ఈ భాషలో తర్ఫీదునిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే ఐఐఎం - ఐఐటీ - ట్రిపుల్‌ ఐటీ - కేంద్రీయ విశ్వ విద్యాలయం, తాజాగా ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
..
Tags:    

Similar News