అమరావతి మాస్టర్ ప్లాన్ 25న

Update: 2015-12-16 16:59 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. అనంతరం దానిపై ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు - సూచనలు - సలహాలను స్వీకరిస్తుంది. ఇందుకు దాదాపు 15 రోజుల సమయం ఇస్తుంది. అనంతరం వాటిని పరిష్కరించడానికి మరో 15 రోజుల సమయం ఇస్తుంది. చివరికి ఫిబ్రవరి మొదటి వారంలో తుది మాస్టర్ ప్లాన్ ను విడుదల చేయనుంది.

అమరావతి నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం సీడ్ కేపిటల్ ప్లాన్, కేపిటల్ ప్లాన్ లను ఇచ్చింది. కానీ అన్నిటికంటే మాస్టర్ ప్లాన్ కీలకం. అమరావతిలో తొమ్మిది నగరాలను నిర్మించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఏయే కార్యాలయాలు ఎక్కడ వస్తాయి? ముఖ్యమంత్రి - మంత్రుల నివాసాలు - క్వార్టర్లు ఎక్కడెక్కడ ఉంటాయి? వాణిజ్య ప్రాంతం ఎక్కడ ఉంటుంది? ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి? రోడ్లు ఎక్కడెక్కడ వస్తాయి? తదితరాలు అన్నింటికీ మాస్టర్ ప్లాన్ కీలకం. రాజధాని ప్రాంతంలో ప్రాంతాలను బట్టి అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదాహరణకు 500 చదరపు గజాలకు పైబడిన ప్రాంతంలో ఎక్కువ అంతస్తులకు అనుమతులు ఇవ్వనున్నారు. ఎక్కడెక్కడ 500 గజాలకు పైబడిన స్థలాలను కేటాయించనున్నారు? ఎక్కడెక్కడ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు? తదితరాలన్నీ మాస్టర్ ప్లాన్ తో బయటకు వస్తాయి. దాంతో అమరావతి నిర్మాణంతోపాటు భవిష్యత్తు చిత్రం కూడా సుస్పష్టంగా కళ్లకు కట్టనుంది.
Tags:    

Similar News