రెడ్డి కులంలోకి మారుతాం అంటున్న రాజధాని రైతులు!

Update: 2020-03-12 06:10 GMT
ఏపీలో స్థానికపోరు యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంది. రాష్ట్రంలో ఏకపక్ష విజయం కోసం వైసీపీ తహతహలాడుతోంది. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఇక బీజేపీ..జనసేన సైతం విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హోరు మొదలుకావడంతో నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అమరావతి నుండి రాజధాని తరలింపు.. అక్కడి స్థానికుల ఆందోళన అంశాలని అందరూ పక్కన పెట్టేసారు. అయితే , అమరావతి రైతులు మాత్రం తన నిరసన తెలియజేస్తూనే ఉన్నారు.

ఇక ఈ సమయంలో అమరావతి ప్రాంత రైతులు సరికొత్త వాదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకి దారితీస్తుంది. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయండి మీ రెడ్డి కులంలోకో, లేదా మీరు సూచించిన కులానికో మారుతామంటూ రైతులు చెప్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు లేకపోయినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో తమకు మద్దతుగా ఇతర ప్రజలు ఏ రకంగా మద్దతివ్వాలో సూచిస్తూ కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చారు. రాజధాని విషయంలో మన నిర్ణయాన్ని చెప్పుకొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే బలమైన ఆయుధం అని తెలుపుతూ , ఓటు వేసే ప్రతి ఒక్కరూ మీ ఓటుతో పాటు జై అమరావతి అని రాసి ఉన్న స్లిప్‌ ని పెట్టి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు తుళ్లూరులో రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. తమకి ఓట్లు పెట్టలేదని,ఒకవేల రాజధాని గ్రామాల్లో ఎన్నికలు పెట్టి ఉంటే ఇలానే చేసేవాళ్లమని చెప్తున్నారు.

అయితే, అమరావతిలో రాజధాని ఏర్పాటు సమయం నుండి తాజాగా రాజధాని మార్పు అంశం వరకు అక్కడ ఒకే వర్గానికి గత ప్రభుత్వం మేలు చేసేందుకు ప్రయత్నించిదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, అక్కడ కేవలం కమ్మ వర్గానికి చెందిన వారే కాదని..అన్ని వర్గాలు ఉన్నాయంటూ స్థానికుల నుండి టీడీపీ నేతలు వివరణ ఇచ్చారు. అయితే, ఈ స్థానిక ఎన్నికల తరువాత రాజధాని మార్పు పక్రియ వేగవంతం చేసే అవకాశం ఉండటం తో ..రాజధాని రైతులు సరికొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు. తమ ప్రాంతం నుండి రాజధానిని తర లించకుండా.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయండి మీ రెడ్డి కులంలోకో, లేదా మీరు సూచించిన కులానికో మారుతామంటూ తాజా నిరసనల్లో రైతులు నినదించారు. తమకు కులం ముఖ్యం కాదని.. తమ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీని ద్వారా ప్రధానంగా అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో కమ్మ వర్గం ప్రజల తీర్పు ఈ స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News