ప్రధానికి స్పీడ్ పోస్టు..అమరావతి రైతుల కొత్త నిరసన

Update: 2019-12-24 12:23 GMT
ఏపీ రాజధానులకు సంబంధించి జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై కొందరు రైతులు అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణతో పాటు.. అన్ని ప్రాంతాల్ని సమానంగా డెవలప్ చేయాలన్న వాదనకు పలువురు సపోర్ట్ చేస్తుంటే.. అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులు మాత్రం రాజధాని మార్పు ఉండకూడదని పట్టుపడుతున్నారు.

కొద్దిరోజులుగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న వారు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రధాని మోడీకి స్పీడ్ పోస్టులతో లేఖలు రాస్తున్నారు. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ సూచనల్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు తమ వాదనకు మద్దతుగా నిలిచేందుకు ప్రధాని మోడీకి లేఖలు రాయాలని డిసైడ్ అయ్యారు.

రాజధాని మార్పు కారణంగా తమకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ వారు ప్రధానితో పాటు రాష్ట్రపతి కోవింద్ కు సామూహిక లేఖలు రాశారు. అంతేకాదు.. తమ లేఖలతోపాటు తాము రైతులమన్న విషయాన్ని నిరూపించేందుకు వీలుగా తమ ఆధార్ కార్డుల పత్రాల్ని.. అమరావతి ప్రాంతానికి చెందిన వారిమన్న చిరునామాకు సంబంధించి ఫ్రూప్ లను పంపుతున్నారు.

గత ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందాల్ని.. రాజధానిలో ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాల్ని.. అక్కడ చేసిన ఖర్చుకు సంబంధించిన అంశాల్ని వారు తమ లేఖలతో జత చేస్తున్నారు. తమ ఆవేదనను పంచుకోవటం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని మారేలా చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.
 
రాజధానిని మార్పు చేసిన పక్షంలో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. గతంలో విపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ రాజధానిని మార్చమన్న మాటలకు సంబంధించిన ఆధారాల్ని తమ లేఖలకు జత చేయటం గమనార్హం. మరి.. ఈ అంశంపై రాష్ట్రపతి.. ప్రధాని స్పందించే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News