బిజీనా.. అమ్మ అనుమతి కోసమా?

Update: 2015-10-18 05:16 GMT
చేతిలో అధికారం ఉండి.. అత్యున్నత పదవుల్లో ఉంటే పలు కార్యక్రమాలు ఉంటాయి. బిజీబిజీగా ఉంటారు. పార్టీ అధికారంలో లేకున్నా.. కీలక పదవి ఏమీ లేకున్నా రాజ్యసభ సభ్యుడు.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం మాగొప్ప బిజీగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ప్రముఖుల్ని.. వివిధ రాజకీయ పక్షాల నేతల్ని ఏపీ మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి వారికి స్వయంగా ఆహ్వానపత్రాల్ని అందిస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం శనివారం జోరుగా సాగింది. ఇందులో భాగంగా.. చిరంజీవికి కూడా మంత్రుల బృందం ఆహ్వానపత్రాన్ని అందించారు.

తనకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వటంపై చిరంజీవి సంతోషాన్ని ప్రకటించటమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పేశారు. తాను శంకుస్థాపన కార్యక్రమానికి రావటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. తప్పనిసరిగా వస్తానన్న మాట కంటే.. ప్రయత్నిస్తానన్న మాట చిరు నోటి నుంచి రావటంతో ఏపీ మంత్రుల బృందం కాస్తంత ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది.

ఇంటికి వచ్చిన మరీ ఆహ్వానిస్తే.. ఏపీ ప్రజల కార్యక్రమం అయిన రాజధాని శంకుస్థాపనకు రావటానికి ప్రయత్నిస్తానన్న మాటకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను చాలా బిజీ అన్నట్లుగా చిరంజీవి మాట ఉండటం గమనార్హం. ఆయన 151వ సినిమా షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి బిజీని అర్థం చేసుకోవచ్చు. ఇక.. ఇంట్లో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉందా? అంటే.. అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

మరి.. ఏ ప్రత్యేక కార్యక్రమం లేకున్నా రావటానికి ప్రయత్నిస్తానని చెప్పటం అంటే బిజీ కాకున్నా.. పార్టీ అదినేత్రి అభిప్రాయం తెలుసుకొని దాన్ని అనుసరించి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలన్న ఉద్దేశంతోనే చిరు అలా మాట్లాడి ఉంటారని విశ్లేషిస్తున్నారు. పార్టీ సొంతది అయితే.. పార్టీ అధినేతగా తన నిర్ణయమే సుప్రీం అయ్యేది. కానీ.. కాంగ్రెస్ లో భాగమైన చిరు.. సీమాంధ్రులు శంకుస్థాపనకు వెళ్లాలన్నా.. వెళ్లకూడదన్నా కూడా అమ్మ అనుమతి తప్పదు కదా. ఈ కారణంతోనే.. రావటానికి ప్రయత్నిస్తానన్న మాట చిరు నోట వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News