మెనూనే కాదు.. టైమింగ్ మారిపోయింది

Update: 2015-10-20 09:06 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజనం పెట్టాలని భావించిన సంగతి తెలిసిందే. దాదాపు లక్షన్నర వరకు ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అందరికి సరిపోయేలా భారీగా భోజనాలు చేప్టటాలని భావించారు. అయితే.. ఇంత భారీ స్థాయిలో భోజనాలు  ఇబ్బందికి గురి కావటం ఖాయమన్న ఆలోచనతో ప్లాన్ మార్చేశారు.

అంతేకాదు.. మొదట అనుకున్నట్లుగా పూర్ణం.. పులిహార లాంటి పదార్థాలతో ప్యాకెట్లు ఇవ్వాలని భావించినా.. ఆ ప్లాన్ ను మార్చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిధులకు.. సామాన్యులకు సంబంధించిన ఆహార పొట్లాల మెనూను మార్చేశారు. అంతేకాదు.. వీటిని తిరిగి వెళ్లే సమయంలో ఇవ్వాలన్న ఆలోచనను కూడా మార్చేసి.. సభా కార్యక్రమం మొదలయ్యే సమయంలోనే ఇచ్చేయాలని నిర్ణయించారు.

శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం మొదలై.. దాదాపు మూడు గంటల పాటు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆకలితో ఇబ్బంది పడటంతో పాటు.. ఆహారం కోసం తొక్కిసలాట చోటు చేసుకునే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చిన సర్కారు.. సభా ప్రాంగణంలోకి వచ్చే ముందే భోజనం ప్యాకెట్ ను ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా గారెలు.. పూర్ణాల స్థానే.. తాపేశ్వరం కాజా.. చక్రపొంగలి (150 గ్రాములు).. పులిహోర.. దద్దోజనం.. ఒక మజ్జిగ ప్యాకెట్ తో పాటు.. రెండు మంచినీళ్ల ప్యాకెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. సభా ప్రాంగణాన్ని 12 కంపార్ట్ మెంట్లుగా విభజించి.. ఒక్కో కంపార్ట్ మెంట్ కు ఒక్కో అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తున్నారు. ఈ కంపార్ట్ మెంట్ లోకి ప్రవేశించే సమయంలోనే ఫుడ్ ప్యాకెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంత ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ఏపీ సర్కారు.. వాస్తవంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News