ఇక‌, కార్పొరేష‌న్ పరిధిలో అమ‌రావ‌తి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు!

Update: 2021-03-23 14:53 GMT
మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించిన వేళ.. అమ‌రావ‌తి ప్రాంతానికి సంబంధించి వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌గిరి-తాడేప‌ల్లి మునిసిపాలిటీ ప‌రిధిని క‌లిపి కార్పొరేష‌న్ గా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్‌ కూడా జారీచేసింది.

మునిసిప‌ల్ ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై శ్రీల‌క్షి ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ త‌మ‌దైన ప్రాంతంగా చెప్పుకున్న అమ‌రావ‌తిలోనూ వైసీపీ జెండా ఎగ‌రేసిన నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలో కార్పొరేష‌న్ల సంఖ్య 13కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, తిరుప‌తి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం, ఏలూరు, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్లు రాష్ట్రంలో ఉన్నాయి.

మంగ‌ళ‌గిరి మునిసిపాలిటీలోని 11 పంచాయ‌తీలు, తాడేప‌ల్లి మునిసిపాలిటీ కింద ఉన్న 10 పంచాయ‌తీల‌ను క‌లిపి ఈ కొత్త మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మునిసిప‌ల్ చ‌ట్టం-1994ను అనుస‌రించి ఈ కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసిన‌ట్టు ఉత్త‌ర్వుల్లో ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

అదేవిధంగా.. విశాఖ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప‌రిధిని కూడా పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 13 మండ‌లాల‌ను వీఎంఆర్డీఏ ప‌రిధిలోకి తీసుకొచ్చింది స‌ర్కారు. రోలుగుంట‌, గొలుగొండ‌, చీడికా, కోటూర‌ట్ల‌, మాక‌వ‌రపాలెం, దేవ‌రాప‌ల్లి, కోట‌పాడు, నాత‌వ‌రం, బుచ్చ‌య్య‌పేట‌, రావిక‌త‌మం, మాడుగుల‌, న‌ర్సీప‌ట్నం, చోడ‌వ‌రం మండ‌లాలు ఈజాబితాలో ఉన్నాయి. దీంతో.. మొత్తం వీఆర్డీఏ ప‌రిధి‌లో ఉన్న గ్రామాల సంఖ్య 431కి పెరిగింది.
Tags:    

Similar News