అమరావతిలో పనులు మొదలవుతున్నాయ్

Update: 2015-12-30 22:30 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పనులకు శ్రీకారం చుట్టుకుంటోంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలకు నెల రోజులు గడువు విధించింది. మొత్తంమీద జనవరి 30వ తేదీలోపులో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయాలని నిర్ణయించింది. అదే రోజు రైతులకు భూములు కూడా ఇచ్చి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే పనులకు శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతానికి కోర్ కేపిటల్ ఏరియాలో భూములను చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. రైతుల నుంచి భూములను తీసుకున్నా.. ఇప్పటి వరకూ వారే వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా వదిలేసింది. తాము పనులు మొదలు పెట్టినప్పుడు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకోవడమే కాదు.. వాటిని ఎక్స్ కవేటర్లతో చదును చేస్తోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా అరటి తోటలను నిర్మూలించి భూములను సిద్ధం చేస్తోంది. మరీ ముఖ్యంగా లింగాయపాలెం, తాళ్లాయపాలెం ఉద్దండరాయునిపాలెంలలోని జరీబు భూముల్లో సీడ్ కేపిటల్ ఏర్పాటు కానుంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా తొలుత సీడ్ కేపిటల్ ను నిర్మించాలనే భావిస్తోంది. ఈ నేపథ్యంలో పనులు కూడా ఇక్కడే ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్ల నిర్మాణం, రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా చదును చేసే పనులను త్వరలోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి నిర్మాణాలకు వీలుగా భూములను సిద్ధం చేయాలనే తాజా ప్రణాళికలో భాగంగా చదును కార్యక్రమాలు సాగుతున్నాయి.
Tags:    

Similar News