రిలయన్స్ సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా తెలివిగా పంచిన అంబానీ

Update: 2022-08-30 04:21 GMT
దేశంలోనే కుబేరుడు.. ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టారు. తను యాక్టివ్ గా ఉండగానే తన ముగ్గురు పిల్లలకు రిలయన్స్ ను మూడు కీలక విభాగాలు చేసి వ్యాపారాలుగా కట్టబెట్టారు. ఇందులో అత్యంత తెలివిగా వ్యవహరించారు. ధీరుబాయ్ అంబానీ పంచినట్టు పంచితే తమ్ముడు అనిల్ అంబానీతో గొడవలు తర్వాత అతడి వ్యాపారాలన్నీ కుదేలైపోయిన సంగతి తెలిసిందే. తన పిల్లలు అలా కాకుండా ఉండేందుకు వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది.

తన ఆస్తులపై భారత్ లోనే నంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు చేతికి వచ్చిన వేళ ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. ఈ జూన్ లో జియో ఇన్ఫోకామ్ కు ఆకాష్ ను చైర్మన్ చేయడంతో తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో స్పష్టం చేశారు.

తన వ్యాపారాలన్నింటిని మూడు భాగాలుగా చేసిన ముఖేష్ అంబానీ వాటిని తన ముగ్గురు పిల్లలకు సమంగా పంచేశారు. ఈ మూడు సంస్థలను మానిటర్ చేసేలా ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకీ ముఖేష్ అంబానీ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.

బాహుబలి సినిమాలో సింహాసనం కోసం కొట్టుకు చచ్చిన వారుసుల వైనాన్ని ముందే గ్రహించిన ముఖేష్ అంబానీ ప్రస్తుతం బడా వ్యాపారవేత్తల కుటుంబాల్లోనూ ఇలాంటి ఆస్తుల గొడవలు చూసి తాజాగా రిలయన్స్ ను విభజించారు. రిలయన్స్ విషయంలోనూ ముఖేష్, అనిల్ అంబానీలు పంచుకోవడం ఎంత గొడవకు దారితీసిందో అందరికీ తెలిసిందే. అనిల్ అంబానీ అప్పులతో ఇప్పుడు ఆస్తులన్నీ పొగ్గొట్టుకున్నాడు. ఇప్పటికే ముఖేష్, అనిల్ అంబానీల మధ్య దూరం ఉంది.

ఇలాంటి పరిస్థితులన్నీ ముందే గ్రహించి.. తను యాక్టివ్ గా ఉన్నప్పుడే ఈ వ్యాపారాలు పంచాలని ముఖేష్ అంబానీ డిసైడ్ అయిపోయారు. తన వారసుల విషయంలో ముఖేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ముఖేష్ అంబానీ చాలా తెలివిగా పక్కా ప్రణాళికతో వ్యవహరించి రిలయన్స్ చీలిపోకుండా ఉండేందుకు అద్భుతమైన ఆలోచనలు చేస్తున్నారు. తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియను ముఖేష్ మొదలుపెట్టారు.

టెలికాం అనుబంధమైన రిలయన్స్ జియో చైర్మన్ గా పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు. ముఖేష్ రాజీనామా చేసి తన కుమారుడిని చైర్మన్ ను చేశాడు.

ఇక మరో కీలకమైన విభాగం ‘రిటైల్’ను ముకేష్ కుమార్తె ఇషా చేపట్టనుంది. ఎందుకంటే ఆడవాళ్లకు ఈ వంటింటి సమానులు, వ్యక్తిగత అవసరాలు ఉండే సూపర్ మార్కెట్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యువెల్లరీ, ఫుట్ వేర్, క్లాతింగ్, జియో మార్ట్ విభాగాలను కొట్టినపిండి. అందుకే వాటిని తెలివిగా కూతురు ఇషాకు ముఖేష్ అంబానీ కట్టబెట్టారు. ఈ మార్కెట్ నిర్వహణ ఈషా బెస్ట్ అని చెప్పొచ్చు.

ఆర్ఐఎల్ గ్రూప్ లోని చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్, టెలికాం, రిటైల్, మీడియా, న్యూ ఎనర్జీ విభాగాల్లో విస్తరించింది. వీటిని చిన్న కుమారుడు అనంత్ కు అప్పగించనున్నారు. ముగ్గురు పిల్లలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని సమయంగా పంచి భవిష్యత్ లోనూ ఎలాంటి వివాదాలు రాకుండా.. రిలయన్స్ గ్రూప్ చీలిపోకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. అన్నింట్లోనూ ముకేష్ ముందుచూపు కనిపిస్తోంది.

వాల్ మార్ట్ సంస్థ అధిపతి అయిన శామ్ వాల్టన్ కూడా ఇలానే తన సంస్థను ట్రస్ట్ కు అప్పగించి కుటుంబ సభ్యులను డైరెక్టర్ గా చేసి తన కంచుకోట సంస్థ చీలిపోకుండా చేశాడు. ఇప్పుడు ముకేష్ అంబానీ అదే చేయబోతున్నాడట.. రిలయన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి కుటుంబం అందులో సభ్యులుగా చేర్చి తన వ్యాపార సామ్రాజ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరాతీసేలా కట్టుబాటు పెట్టబోతున్నట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News